కొల్లాయి గట్టితే నేమి? (part 2 of 2)
పదిమంది మధ్య, చిన్నపిల్లాడిని చేసినట్లు చెవిపట్టుకోవడం చిన్నతనం అనిపించినా, అది దురుద్దేశంతో చేసింది కాదని రామనాధం ఎరుగును. నాయకుల హాస్యాలూ, నవ్వుతాలూలో పాల్గొన్న వుత్సాహంలో ఆ విషయం బాధాకరమూ కాలేదు, అది జ్ఞాపకమూ లేదు.
అతనికది బాధ కలిగించలేదు గాని, ఇతరులు కొందరికి అది కష్టం అనిపించింది. రామనాధం మరచినా వారు మరువలేకపోయేరు.
చెవి గుంజినందువలన కలిగిన చిన్నతనం కాళేశ్వరరావుగారి క్షమార్పణ చెప్తే సరిదిద్దబడదనే భావం రామనాధానికి లేదు.
కాని వలంటీరు దళాల అధినాధుడు దానిని వలంటీరు దుస్తుల్ని చిన్నపరచడంగా భావించేడు.
దానికి కాళేశ్వరరావుగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
కాని, కాళేశ్వరరావుగారు నిరాకరించేరు.
అయితే వలంటీర్ల పని బంద్ అని ఆయన ప్రకటించేడు.
ఫలితంగా ఒక్క వలంటీరు కనబడలేదు.
దీనికంతకూ తానే కారణమయినట్లు రామనాధం తల్లడిల్లిపోయేడు.
ఒక్కొక్క చిన్న సంఘటన ఎంతెంత దూరం, ఎటువంటి ఫలితాలనిస్తుందో కండ్లారా చూస్తూ రామనాధం ఎంతో దుఃఖపడ్డాడు.
ఆ సాయంకాలం బహిరంగ సభ కల్లోలం మధ్య ముగియడం ఒక్కటేనా?
ఆ పూట గాంధీజీకి ఆహారం లేకుండా పోయింది.
గాంధీజీ సరిగ్గా ఆరు గంటలకు ఆహారం తీసుకుంటారు. ఆ సమయంలో ఆయన సభా స్థలంలో వుండాలి, ఆ వుద్దేశంతోనే ఆయన ఆహారాన్ని అక్కడికే తీసుకెళ్ళేరు.
కాని, ఆహారం తీసుకోవలసిన వేళకి ఆయనను కోడేరు వస్తాదు రాజు సోదరులు బసలోకి తీసుకువచ్చేరు. ఆయన ఆ వేళ దాటితే మరేమీ తీసుకోరు. బసకు వస్తూనే నిరాహారంగానే తమ పనికి వుపక్రమించేరు.
ఆయన నిరాహారం వుండవలసి రావడం ప్రతివారికీ వ్యధ కలిగించింది. కాని ఆయన అది అతి సామాన్య విషయంగా త్రోసిపుచ్చేరు.
"తరుచుగా ప్రయాణాల్లో ఇంతే. దీనివలన నా ఆరోగ్యం చెడదు" అన్నారు.
అయినా మనసుకేమిటో కష్టంగానే వుంది. రైలెక్కే వరకూ ఆ ఘటన మనస్సుని కోస్తూనే వుంది.
నాలుగు
రాజమండ్రీలో దిగేక గాని గోదావరి కాలువలు కట్టేసి వుంటారనే సంగతి గుర్తు రాలేదు. వానపల్లి కాలువ కట్టేసి వుండరు. కాని, కాలువల్లో నీళ్ళు వుండవు. పడవలు సరిగ్గా వెడతాయనే నమ్మకం లేదు. నలభయి మైళ్ళలో వున్న ముంగండ చేరాలంటే అంచె బళ్ళ మీద రెండు రోజులు పట్టేలా వుంది.
రామనాధం స్వరాజ్యం వంక చూసేడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. భర్తను విడిచి ఒక్క రోజు కూడా దూరంగా వుండేందుకు ఆమె సిద్ధంగా లేదు.
"నేనూ బ్రహ్మాండంగా నడిచెయ్యగలను."
రామనాధం ఒక్క క్షణం ఆమె వంక చూసేడు. తాము తొందరగా వూరు చేరాలి. దారిలో పడవ ఎక్కడన్నా మెరకపడితే దానిని కదిలించేవరకూ కూర్చుందామన్నా కుదరదు. వెంటనే కదలవలసి వుంటుంది. ఎక్కడ ఆ అవస్థ తటస్థపడుతుందో.....
అతని అభిప్రాయాన్ని, తటపటాయింపును గమనించి స్వరాజ్యమే చొరవ తీసుకుంది. గుర్రబ్బండీని కేకేసింది.
"ధవిళేశ్వరం."
రామనాధం ఒక చిన్న సవరణ పెట్టేడు.
ఇంత బెడ్డింగు మోయడం కష్టం. అవసరమైనవి జోలె సంచులలో తీసుకొని మిగిలినవి రంగనాధరావు మేస్టారి ఇంట పడేసి పోదామని అతని సలహా.
వారిని చూసి రంగనాధరావు దంపతులు బ్రహ్మానందపడ్డారు. వారు దంపతులయ్యేరని విని రంగనాధరావు ఆశ్చర్యపడ్డాడు.
"ఎప్పుడు చేసుకున్నావు? నన్నెందుకు పిలవలేదు?"
కాని, అసలు కథ విన్న తరువాత రంగనాధరావు ఔడు కరిచేడు.
"భార్య వుండగా, భర్త వుండగా రెండో పెళ్ళి చేయడానికి బ్రహ్మసామాజికులు వొప్పుకోరు. హిందూమతం వొప్పుకుంటుంది. కాని మీరు వేర్వేరు కులాల వాళ్ళు. కనక అదీ వొప్పుకోదు."
"కనకనే మాస్టారూ! మేము వివాహపు తంతుకి ప్రాముఖ్యం ఇవ్వం అనుకొన్నాం. మా మనస్సులు కలిశాయి. మేము ఆ క్షణంలోనే పెళ్ళి అయినట్లే భావించుకొన్నాం."
"పెళ్ళి అనేది ఒక భావన. అది మన మనస్సులలో కొన్ని అనుబంధాలను కల్పించి వుంచింది. ఈనాడు పెళ్ళిని తోసెయ్యగలం. కాని ఆ అనుబంధాలను కూడా తోసివేయగలిగినప్పుడే...."
"అంటే...."
"ఆ అనుబంధాల బాహ్యరూపం తప్పు చేస్తున్నామనీ, తప్పు చేస్తున్నామన్న సంకోచాలూ, సంతోషాలూను."
రామనాధం, స్వరాజ్యం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"మేము ప్రపంచాన్నే ధిక్కరించి నిలబడతాము మాస్టారూ! మేం చేస్తున్నది తప్పు కాదు. మాకు ఏర్పడిన పరిస్థితులలో ఆ పెళ్ళిళ్ళ నుంచి విముక్తి కావాలి. అది దొరకదు. మా వివాహాన్ని గుర్తించని సమాజాన్ని మేమూ గుర్తించము."
"ఆ ధైర్యం అవసరం. మంచిదే, అయితే ఆ ధైర్యానికి అప్పుడప్పుడు సామాజికమైన ఆలంబన అవసరం. కనీసం ఆ ఆలంబన వున్నదనే భావనయన్నా అవసరం."
ఆ అవసరం మనస్సుకి అనిపించినప్పుడు ఆ యువదంపతుల్ని రాజమండ్రి రమ్మని ఆహ్వానించేడు రంగనాధరావు.
"మీకు వివాహం నేను చేయిస్తా."
"దానికి సంఘబలం వుంటుందా మేస్టారూ!"
"మీ యిద్దరికీ జరిగిన ప్రథమ వివాహాలతో సంఘబలం ఏం కనిపించింది? అది ఒక భావన మాత్రమేనని చెప్పాను. మన మనస్సులు కొన్ని కార్యకలాపాలకి అలవాటు పడిపోయాయి. వానిని మనం పాటించకుండా తోసేస్తూనే వుంటాం. కాని, ఆ కార్యకలాపాలతో ముడిపడి వున్న భావనలు మన మనస్సుల్ని పట్టుకొనే వుంటాయి. లేకుంటే వివాహబంధం విచ్ఛేదం చేసుకొనే అవకాశం కావాలనే మీ కోరికకు అర్థం ఏమిటి? అవి ఏనాడో విచ్ఛిన్నం అయేయికదా."
రామనాధం ఆ మాటలోని నిజాన్ని అర్థం చేసుకోగలిగేడు. కాని, మనస్సులో అనేక అనుమానాలు.
స్త్రీ పురుష సంబంధాలకు సామాజికమైన హద్దు అనేది లేకుండా చేసి కేవలం వ్యక్తి నిష్ఠమైన ప్రేమను మాత్రమే ప్రాతిపదికగా అంగీకరిస్తే రోజుకి ఒకళ్ళను మార్చే ఘట్టం ఏర్పడుతుంది కదా. అటువంటి స్వేచ్ఛా, ప్రేమ సంఘానికి గాని, వ్యక్తికి గాని లాభమా?
"కాదు...." అని ఖచ్చితమైన కంఠంతో రంగనాధరావు స్పష్టం చేశాడు.
"స్త్రీ పురుష సంబంధాలు కేవలం వైయక్తికాలు కావు. అవి సాంఘికమైనవి మాత్రమే కూడా కాదు. అందుచేత కనీసావసరములైన పరిమితులతో వానిని ఆమోదించవలసి వుంటుంది. రష్యాలో వాళ్ళు అటువంటిదేదో తలపెట్టినట్లు తోస్తుంది. వాటిని నిందిస్తూ వస్తున్న అభిప్రాయాల్ని బట్టి అసలు ఏమిటో వూహించవలసి వస్తున్నదే గాని, యథార్ధస్థితి తెలియడంలేదు" అంటూ ఆయన మరల రష్యాను గురించి చెప్పాడు.
రామనాధం భార్యతో లేచేడు.
"వెళ్ళి వస్తాం మేస్టారూ!"
లాకుల వద్ద బండి దిగి ఆనకట్ట మీదికి వెడుతూంటే స్వరాజ్యం వెనక్కు తగ్గింది.
"రా, మళ్ళీ ఆలస్యమయిపోతూంది."
ఆమె అతని చాటుకి వచ్చింది. తల బాగా వంచేసుకుంది. ఆమె స్థితి అతనికి అర్ధం కాలేదు. కాళ్ళు అప్పుడే మెత్తపడిపోయాయనుకున్నాడు. జాలిపడ్డాడు.
"రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కదూ."
"రాళ్ళూ లేవు, ఏమీ లేవు. నడవండి."
ఇద్దరూ ఆనకట్టమీదికి వచ్చేరు. అప్పుడు చెప్పింది. ఆ కారణం వింటూ వుంటే ఆశ్చర్యం కలిగింది.
ఆమె రాజమండ్రిలో వున్న రోజుల్లో వారి పొరుగునున్న ఒకళ్ళిద్దరు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం దగ్గర పచ్చిక మీద కూర్చుని వున్నారు. వాళ్ళ కంటబడడానికి ఆమె సిగ్గుపడింది.
బెజవాడలో ఆమె తనను భర్తగానే చెప్పింది కాని, ఇక్కడ కూర్చున్నవాళ్ళు ఆమె భర్తను--ఏలుకోడానికి నిరాకరించిన భర్తను--ఎరుగుదురు. ఈవేళ రామనాధాన్ని ఎవరంటే ఏమి చెప్తుంది? అదీ భయం.
రంగనాధరావు చెప్పిన మాటలకర్థం ఇదన్నమాట అనుకున్నాడు.
"మీరు భయపడరా?" అని స్వరాజ్యం అడిగింది.
భయపడననే అనుకొన్నాడు. కాని, ఒక్క అరగంటలో తన ఆలోచన వట్టి అబద్ధమని తేలిపోయింది.
ఆమె ఆ ప్రశ్న వేసినప్పుడు రామనాధం ఎగతాళి చేసేడు.
"ఏం తల తీస్తారా? నడు. పలకరించిపోదాం."
నిలబడిపోయిన రామనాధాన్ని స్వరాజ్యం నెట్టింది.
"పలకరించి వచ్చే లోపున పడవ దాటిపోతుంది....."
భుజాన వున్న సంచిని సర్దుకుంటూ రామనాధం ముందడుగు వేశాడు.
"ఇల్లా ఇవ్వండి, కొంత దూరం నేను తెస్తాను" అంది స్వరాజ్యం.
"అది నాకిస్తావా?"
నిజానికి ఆమె సంచీయే కొంచెం పెద్దదిగా వుంది. అయినా ఆమె దానిని అతనికివ్వడానికి అంగీకరించలేదు.
అతడు నవ్వేడు. తన భుజాల వంకా, ఆమె వంకా చూశాడు.
"నిన్ను చేతుల్లో ఈ వేపునుంచి ఆవేపుకంటా తీసుకుపోగలను. ఎంత పందెం..."
ఆమె అతని వంక చూసి కళ్ళతోనే నవ్వింది.
"వద్దులెండి."
ఆనకట్ట మీద కొంత దూరం వెళ్ళేక ఇద్దరు యువకులు ఎదురయ్యేరు. వాళ్ళని చూసి రామనాధం నిలబడ్డాడు.
ఎదురుగా నాలుగైదు తలుపుల మేర ఆనకట్టమీద నీరు పొర్లుతూంది. చప్టా పాకుడు పట్టి వుంది. జాగ్రత్తగా నడవాలి. ఆ పాకుడు మీద తప్పుకోవడం కష్టం.
"వాళ్ళని వచ్చెయ్యనీ...."
వాళ్ళు వచ్చేశారు. ఎదుటకు వచ్చేశాక ఆ యువకులలో ఒకడిని తన మిత్రుడూ, సహాధ్యాయిగా గుర్తించేడు.
అతడూ వారిద్దరినీ గుర్తించేడు.
"ఇదిగో రామనాధం! బెజవాడనుంచి వస్తున్నావనుకొంటాను...... మీ పేరు స్వరాజ్యం కాదూ, జ్ఞాపకం వున్నానా? మనం ఇద్దరం మెట్రిక్‌లో......."
"గుర్తుంది. మీ పేరు మంగరాజు కాదూ." అని స్వరాజ్యం తన జ్ఞాపకాన్ని ప్రకటించింది.
"ఇప్పుడేం చేస్తున్నారు?" అంది.
"ఇంజనీరింగ్ కాలేజీలో చేరేను." అన్నాడు మంగరాజు.
రామనాధము ఆశ్చర్యం కనబరచేడు.
సహాయ నిరాకరణంగా కాలేజీ మానేస్తున్నానని తనతోబాటు బయటకు వచ్చిన నలుగురైదుగురు యువకులలో మంగరాజొకడు. కాని సూపరింటెండింగ్ ఇంజనీరు తండ్రి మర్నాడే అతనిని కాలేజీకి తెచ్చి వదిలేసేడు. అతడు లక్షణంగా చదువుకొని డిగ్రీ తీసుకొన్నాడు. వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.
ఆ ఏడాదికి చదువు పూర్తి చేసుకొన్నాడంటే పోనీలే అనిపించింది. కాని, కొత్త కోర్సులో చేరేడని విన్నాక రామనాధం అతని వంక చూసిన చూపుకు మంగరాజు నవ్వేడు.
"స్వరాజ్యం వచ్చేక టెక్నికల్ బలగం మనకెంతో అవసరం, ఆనాడు అద్దద్ద అంటే ఎక్కడ వస్తారు? ఆ విజ్ఞానం సాధించుకోలేకపోతే స్వరాజ్యం సంపాదించుకున్నాక మళ్ళీ నువ్వు వెనక్కేనా వెళ్ళాలి. లేదా మళ్ళీ ఆ ఇంగ్లీషువాడినో, మరొకడినో భంగపడాలి" అన్నాడు.
రామనాధానికి ఆ వాదం నచ్చలేదు. స్వరాజ్యం సాధించడం కోసం నానా హింసలూ పడేది తాము. దానిని సుస్థిరం చేయడం పేరుతో ఇప్పటి నుంచీ అంగోస్త్రాలు పరుస్తున్నారన్నమాట అనుకున్నాడు.
పైకి "ఆమాట నాకు తోచనే లేదు సుమా, తోస్తే బహుశా ఇంగ్లండులో వుండేవాడిని" అన్నాడు.
మంగరాజు దానికి సమాధానం ఇవ్వలేదు. అతనికీ రామనాథం కథ అంతా తెలుసు.
"మా మామగారు నిన్ననే వెళ్లేడిల్లాగ, గాంధీగారు డెల్టా సంచారం వస్తున్నారటగా, గుండెలు కొట్టుకుంటూ పరుగెత్తుతున్నాడులే" అంటూ నవ్వేడు.
రామనాధం కనుబొమ్మ ముడిచేడు. క్షణంలో ఏదో నిర్ణయించుకొన్నట్లు ముఖం విప్పారింది.
"నీకు పరిచయం చెయ్యడం మరిచిపోయేను. ఈమెను నువ్వు మీ క్లాస్మేట్గానే ఎరుగుదువు. ఈవిడ నా భార్య."
మంగరాజు అంతవరకూ ఆలోచిస్తున్న సమస్యకు అర్థం దొరికింది. ఏవిధమయిన బంధుత్వమూ, పరిచయమూ కూడ వుండడానికి అవకాశం లేదనుకునే వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూండడం అతనికి ఆశ్చర్యంగా వుంది. ఆమె కులం అతని కులం ఒకటి కాదని అతడెరుగును. ఈ విషయం అతనికి మరీ ఆశ్చర్యంగా వినిపించింది. కాని మర్యాదకి బయటపడకుండా అభినందనలు తెలిపేడు.
"మీ దంపతులిద్దరూ ఈవేళ మా యింటిలో వుండిపోండి....."
రామనాధం మెత్తపడలేదు.
"గాంధీగారు వస్తున్నారని ఎరుగుదువుగా, అందుకే ఈ పరుగు."
బెజవాడ సభలో తిలక్ స్వరాజ్యనిధి కోటి రూపాయలు వసూలు చెయ్యాలని కాంగ్రెసు నాయకులు నిశ్చయించుకొన్నారు. ఆ వసూళ్ళ కోసమే గాంధీగారి పర్యటన.
ముంగండకి గాంధీగారిని తీసుకువచ్చి తను నడుపుతున్న ఖద్దరు వుత్పత్తి కేంద్రానికి ఆయన ఆశీర్వచనం సంపాదించాలని రామనాధం ఆలోచన.
కానీ, గాంధీగారిని ముంగండ తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు కళా వెంకట్రావుగారు. ఆయన కార్యక్రమాన్ని డెల్టాలో సక్రమంగా నడిపించే బాధ్యత వెంకట్రావుగారిది. ఆయన గాంధీగారి ప్రయాణంలో ముంగండ చేర్చడానికి వీలు లేదంటున్నాడు. రాజోలునుంచి గన్నవరం మీదుగా అమలాపురం రావడానికి వీలుంటే ముంగండ గాంధీగారు రావడం సాధ్యమే. కాని, మధ్యలో వశిష్ట మీద ఆక్విడక్టు వుంది. దానిని దాటడం ఎలాగ?
"ముందు ముంగండ వెళ్ళాలి. అక్కడికి వెళ్లేకనే ఏ ఆలోచన అయినా."
కాని, అది మాటవరసకు ఇచ్చిన సమాధానం మాత్రమే. ఏం చెయ్యాలో అతడప్పుడే ఓ పథకం వేసుకున్నాడు.
తిలక్ నిధికి తమ వూళ్ళో కూడా ఓ నూటపదహార్లు ఇస్తామంటే గాంధీగారి కార్యక్రమాన్ని అనుకూలంగా సర్దుబాటు చేస్తారని అతని ధైర్యం. బెజవాడలో ఆ నిధికి పెద్ద విరాళం ఇచ్చిన వర్తక ప్రముఖుని యింటిలో గాంధీగారి బస ఏర్పాటు చేశారు. అదీ అతని ధైర్యం.
అతని ఆలోచన విని మంగరాజు ఆలోచించేడు.
"కాలువలు కట్టేశారు కాదటయ్యా?"
ప్రశ్న అడగడంలో మంగరాజు వుద్దేశం వేరు. రామనాధం అర్థం చేసుకొన్నది వేరూను.
"వానపల్లి కాలవలో పడవలు వెడుతున్నాయి."
మంగరాజు ఇంక ఆతనిని ఒత్తిడి పెట్టదలచుకోలేదు. స్వరాజ్యం వేపు తిరిగేడు.
"మీ మాటేమిటి? నాన్నగారు రేపు కారులో రాజోలు ప్రయాణం పెట్టుకున్నారనుకుంటాను. వారి కారు ముంగండ మీదుగానే వెడుతుంది మీరు ఆగండి."
ఆమె ప్రయాణంలో ఇబ్బంది పడలేదనే ఆలోచనతో రామనాధం ఆమె ముఖం వంక చూసేడు. కాని, ఆమె నిరాకరించింది.
"కాదండి క్షమించాలి. ఇద్దరం వెళ్ళాలి."
అయిదు
ఊళ్ళో అడుగు పెట్టేసరికి దేవుడి గుడి వీధిలోంచి ప్రభాతభేరీ సాగుతూంది.
సుందరమైన రాట్నమే. పసందు బాంబురా.....
విశాలాక్షి నవ్వుతూ ఆ హడావిడి ఏమిటో వివరించింది.
"మేనమామ పోలికలు వట్టినే పోవు. ఈయనగారు హైస్కూలు పూర్తి చేయకుండానే చదువు మానుతాడో ఏమో కొంపతీసి."
ఆమె కంఠంలో ఆదుర్దాయేగాని కోపం వినిపించలేదు.
బాలకృష్ణ ఈ వారం నుంచీ తన యీడు కుర్రకారును పోగుచేసి తెల్లవారగట్ల ప్రభాతభేరీ ముగించుకొని బడికి పరుగెత్తుతున్నాడు.
రామనాధం నవ్వుకున్నాడు.
"ఎక్కడో పాటలు కూడా సంపాదించేడు."
విశాలాక్షికీమారు కోపం వచ్చింది.
"ఏవో స్వరాజ్య గీతాలంటూ తెచ్చేడు. కుర్రనాగమ్మనిచేసి పుస్తకం ఖరీదు రెట్టింపు వసూలు చేశాడురా."
రామనాధం ఆ మాటకు ఎక్కువ శ్రద్ధ చూపలేదు. కాని మాటవరసకు అడిగేడు.
"ఎవరది?"
"మన గవరయ్యే."
"ఉహూఁ" అన్నాడు.
గాంధీగారికి గ్రామంలో స్వాగతం ఇవ్వడానికై చేస్తున్న ప్రయత్నాలలో ఆ గవరయ్య ఆ రెండు రోజులూ తన వెనకనే వున్నాడు. కుర్రవాడికి స్వరాజ్యగీతాలు కావాలనే ఆసక్తిని వుపయోగించుకొని లాభం తీయడానికై అతడు ప్రయత్నం చేశాడన్న విషయం అతని మనస్సును గంద్రగోళ పరుస్తూనే వుంది. తీరా చేస్తే ఆ పుస్తకం మీద అతడు తీసిన లాభం రెండణాలే. అక్కడ డబ్బు ఎంత అని గాదు సమస్య. ఆ ధోరణిలో వున్న ప్రజాద్రోహ చింతన అతనిని బాధిస్తూంది.
చివరకు వుండబట్టలేక రెండో రోజున అడిగేసేడు. అయితే గవరయ్య నవ్వేడు. తప్పు అనుకోలేదు. సిగ్గు పడలేదు.
"లేకపోతే ఈ తిరగడానికి డబ్బులేవీ, పన్నెండు పుస్తకాలు అమ్మేను. రెండు రోజుల భత్యాలొచ్చేయి" అన్నాడు.
కాని రామనాధం మనస్సు సంతృప్తి పడలేదు. దేశభక్తీ-మోసమూ పొత్తు కుదరని భావాలు.
ఆ సమ్మిశ్రణం వెనుకనున్న స్వార్థాన్ని రామన్న చాల మోటుగా వివరించేడు.
"దేశభక్తీ కాదు, దిబ్బభక్తీ కాదు, బీడీముక్క కావలసివస్తే పెళ్ళాన్ని కూడా ఆమ్మేస్తారు. ఇల్లాంటివాళ్ళే."
అవమానకరమైన ఆ వ్యాఖ్యకు పెద్ద పేచీ వస్తుందని రామనాధం భయపడ్డాడు. కాని గవరయ్య నిశ్శంకగా నవ్వేశాడు.
"గాంధీగారు వస్తున్నారన్నా, ఒక్కపూట సెలవు పెట్టి ఏదన్నా పని వున్నా చేయడానికి రారుగాని, వచ్చేవాళ్ళకి వెధవ నీతులు....."
రామన్న కొత్తగా ఓ ఎలిమెంటరీ స్కూలులో మాస్టరీ సంపాదించేడు. ఒంటిపూట బడి, రెండోపూట వచ్చి పనిచెయ్యడం గవరయ్య దృష్టికి చాలడం లేదు. డబ్బుకోసం కట్టుబడిపోయాడని అతని అభ్యంతరం.
రామనాధం అప్పటికి వాళ్ళని సర్దుబాటు చేశాడు. కాని, ఖచ్చితంగా అతని అభిమానం రామన్నవేపే. అతడు శ్రమపడి పనిచేస్తున్నాడు. తనకు కావలసిన డబ్బు సంపాదించుకొంటున్నాడు. మిగతా వేళల్లో వచ్చి గ్రామ ఉమ్మడి పనుల్లో పాల్గొంటున్నాడు.
గవరయ్య ఇరవై నాలుగు గంటలూ పని చేయగలుగుతున్నానంటూ తన ప్రక్కనున్న వాళ్ళని మోసం చేస్తున్నాడు.
"నేనెవ్వరినీ మోసం చెయ్యలేదు. రెట్టింపు ఖరీదు ఇస్తే పుస్తకాలు ఇస్తానన్నాను. బలవంతం ఏం వుందీ? నేను మీ వాడిని కొనమని ఏడిశానా ఏమన్నానా? అమ్ముడుకాకపోతే నాకు నష్టం కలగదా. నష్టం-లాభం....."
రామనాధం అతని వాదనను ఒప్పుకోలేదు.
ఆ గవరయ్యే సుబ్బావధాన్లు తిలక్నిధికి రూపాయన్నా ఇవ్వలేదని ఏమీ పుచ్చుకోకుండా లేచివచ్చేడు.
ఆయన నిధికి రెండణాలు మాత్రమే ఇవ్వబోయేడు. గవరయ్య "ఇదా ఇచ్చేది" అని విసిరేసేడు.
అంతకన్న ఏమీ ఇవ్వనని అవధాన్లు పొమ్మన్నాడు.
ఆ విషయంలో కూడా రామనాధం గవరయ్యనే తప్పుపట్టేడు.
"ఆ గాంధీగారు దీనిని 'పైసా ఫండు'గానే వసూలు చెయ్యమన్నారు. ఆ విధంగా కోటానుకోట్లమందికి కాంగ్రెసు ఆశయాలు ప్రచారం అవుతాయని....."
గవరయ్య నవ్వేడు.
"పైసా లెక్కన తేలిందే కూలిపని చేసుకొనేవాడు కూడా ఒక కానీ సులభంగా పడేస్తాడు."
"పడేస్తే మంచిదే. ఇష్టాపూర్తిగా ఇచ్చినదే..."
ఈమారు రామనాధం దొరికేడని గవరయ్య గంతువేసేడు.
"ఇష్టాపూర్తిగా కుర్రాళ్ళు నా పుస్తకానికి ఇచ్చిన ఖరీదు మోసం అన్నావు. ఇప్పుడిది...."
ఆ వ్యాఖ్యానం, సమర్థన విన్నాక గవరయ్యకు రామనాధం నమస్కారం చేయడం తప్ప మరో మార్గం లేదు.
"నీబోటి తత్వవేత్త లభించినందుకు కాంగ్రెసు తల తీసి చంకన పెట్టుకోక తప్పదు."
గవరయ్య కోపం చేయలేదు. సిగ్గుపడలేదు. బహు తేలికగా ఆ నమస్కారం అందుకొని ఆశీర్వదించేడు.
"దీర్ఘాయుష్యమస్తు, ఆపాదశిరః పర్యంతం బహు-ఏదో-సమృద్ధిరస్తు....."
గవరయ్యవంటి వాళ్ళ ఉత్సాహమూ, భక్తీ కాంగ్రెసుకి ప్రతిష్ఠో, అప్రతిష్ఠో తేల్చుకోలేకపోయేడు రామనాధం. కాంగ్రెసు మాట ఎలా వున్నా దేశానికీ, ప్రజలకూ నష్టమేగాని....
ఆ ఆలోచనలతో కొట్టుకుపోతూ అతడు వీధిన పోతూంటే అరుగుపై కూర్చుని జపం చేసుకుంటున్న సుబ్బావధాన్లు పిలిచేడు.
ఆయన తనకు గత దినం రాత్రి వచ్చిన కలను చెప్పదలిచేడు.
పెద్ద బుగ్గమీసాలున్న అజానుబాహువయిన వ్యక్తి కలలో కనిపించేడు. అతను అంగోస్త్రం వంటిది కట్టుకున్నట్లు అనిపించింది కాని అది పట్టుది. "పీతాంబరం సుమీ" అన్నాడు అవధాని.
"చేతిలో ఏదో వుంది, ముందు రాట్నంలా అనిపించింది. కాని సరిగ్గా చూసేసరికి చక్రాయుధం, నా వళ్ళు పరవశమయిపోయింది.
'స్వామీ' అని ఒక్క సాష్టాంగం చేసేను. నా చేతిలోని ఒక్క తులసీ దళం ఆయన పాదాలమీద వుంచేను.
సుబ్బావధాన్లు ఆత్మవంచన చేసుకొంటున్నాడో, తమకందరికీ ప్రోత్సాహం ఇవ్వదలచేడో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారిని ఆయన విష్ణుస్వరూపుడిగా వర్ణిస్తున్నాడు.
గాంధీగారికి ఏ కొద్దియో ఇవ్వాలనుంది. కాని వసూలు చేస్తున్న వాళ్ళు నిరాకరించారు. అది కష్టం అనిపించింది.
ఎందుకో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారు చెప్పిన అస్పృశ్యతా నివారణ ఆయనకిష్టం కాదు. అయిదారు నెలల క్రితం తన తోటలో నూతి సమస్యపై ఆయన కనబరచిన స్వార్థబుద్ధికి అప్పుడు కోపం వచ్చింది. ఈవేళ గాంధీగారు ప్రారంభించిన వసూళ్ళలో తన బేడా కూడ చేరాలని ఈ తాపత్రయం ఏమిటో. దానికై అబద్ధాలాడడానికీ, అభూత కల్పనలకీ కూడ సంసిద్ధం అవడం ఏమిటో..... రామనాధం తేల్చుకోలేకపోయినా, ఆయనను విరాళం కోసం అర్థించేడు.
"పత్రం పుష్పం ఫలం తోయం... అన్నారు. గాంధీగారు కూడా దీనిని పైసా ఫండ్ గానే వసూలు చేయాలని..."
అవధాన్లు ముఖం వికసించింది.
"నిజంగా.....!" ముందుకు వంగి రహస్యంగా అడిగేడు.
"ఒక అణా ఇస్తే బాగుంటుందంటావా!" అన్నాడు.
రామనాధం కండువా కొంగు పట్టేడు.
సుబ్బావధాన్లు ఆశ్చర్యంతో ముఖం వంక చూస్తూ నాలుగణాలబిళ్ళ వేసేడు. రామనాధం నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
"గాంధీగారు దీని విలువ కోటిరూపాయలతో సమంగా భావిస్తారు మామగారూ."
ఆరు
తోట మకాములోకి వచ్చేసరికి మంగరాజు కూర్చుని ఎదురు చూస్తున్నాడు.
"ఎంతసేపయింది వచ్చి?"
"ఇప్పుడే నాన్నగారు రాజోలు వెళ్ళాలనుకుంటున్నారన్నాను కదూ! వారితో వచ్చాను. వారు నన్నిక్కడ వదిలి గన్నవరం వెళ్ళేరు."
కారు అక్విడక్టు తొట్టిలోకి దిగేటందుకూ ఎక్కేటందుకూ ఇటు గన్నవరం వేపునా, అటు లంకల గన్నవరం వేపునా, సొలుపులు చేయించమని మొన్ననే ఫోనులో చెప్పేడు. ఈ వేళ వచ్చేరు.
ఆ వార్త వినగానే మత్తు వదిలినట్లు రామనాధం లేచేడు.
"నడు, మీ నాన్నగారిని కలుసుకోవాలి."
"అభ్యంతరము ఏమిటిగాని, ఆయన ఇంకా గన్నవరంలో వున్నారాయని సందేహం."
పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లినట్లయి రామనాధం గమ్మున చప్పబడిపోయేడు.
"గుర్రబ్బండి చేసుకువెడదాం. ఆయన్ని ఎక్కడున్నా పట్టుకోవాలి."
ఆ ఆదుర్దా ఎందుకో మంగరాజు ఎరుగును. కాని, ఎరుగనట్లే నటించేడు.
"ఏమిటా వుప్పెన, ఎక్కడున్నారని వెడతాము? ఆయన కారులో వెడుతూంటే గుర్రబ్బండీలో వెంటబడతావూ? నయం కాదూ, ఒంటెద్దు బండిలో వెడదామన్నావు కావు."
రామనాధం తన అవసరం చెప్పేడు. అక్విడక్టు తొట్టిలోంచి గాంధీగారి కారు రావడానికి అనుమతి కోరాలి.
అదే జరిగితే ఆయన ప్రయాణం వెనకముందులు కావలసిన పని లేదు. అమలాపురం నుంచి రాజోలు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరగనక్కర లేకుండా గన్నవరం మీదుగా ముంగండ వస్తారు. తన ఖద్దరు ఉత్పత్తిశాఖకు ప్రారంభం జరుపుతారు. ముందుకు వెడతారు. కొత్తగా మరో నాలుగైదు గ్రామాలకు ఆయన వెళ్ళగలుగుతారు.
మంగరాజు అన్నీ విని వుపాయం చెప్పేడు. సబ్‌డివిజనల్ ఆఫీసరుగారికి ఆయన ఎక్కడ వున్నదీ తెలుస్తుంది. అక్కడనుండి ఫోన్లో మాట్లాడవచ్చులే అన్నాడు.
కాని, అంతకన్న అదనం చెప్పడానికి మంగరాజు సిద్ధంగా లేడు.
గాంధీగారి ప్రయాణానికి సౌకర్యం కలిగించడానికి ప్రయత్నించినట్లు కనిపించకుండా సాయం చేయడానికే సూపరింటెండింగ్ ఇంజనీరు రాజోలు ప్రయాణం పెట్టుకున్నాడని మంగరాజు ఎరుగును. కాని అతడేమి చెప్పలేదు.
ఆత్మాభిమానం చంపుకుని ప్రిన్సిపాల్‌కు క్షమాపణ చెప్పుకుని, కొడుకు కాలేజీలో చేరేటట్లు వొత్తిడి పెట్టిన ఇంజనీరు ఈనాడు గాంధీగారి ప్రయాణం సౌకర్యం కోసమే రాజోలు ప్రయాణం పెట్టుకొని వుంటాడన్నది రామనాధం వూహలకు అందని విషయం.
"అయితే నడు, వెడదాం...."
"మరి ఇక్కడి పనులు ఏం చేస్తావు. పోనీ నేను వెళ్ళి చెప్పి వస్తానులే" అన్నాడు మంగరాజు.
"అక్కర్లేదు. స్వరాజ్యం వాళ్ళ నాన్నగారూ ఇక్కడే వున్నారు. వారే ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నారు."
మంగరాజు రెండు రోజుల క్రితం స్వరాజ్యం సమ్ముఖంలో వుండడంచేత అడగలేకపోయిన ప్రశ్న ఇప్పుడు అడిగేశాడు.
"మీరు వూళ్ళోనే కాపురం పెడతారా?"
అతని ప్రశ్నలకు మూలం ఎరిగిన రామనాధం ఆచి యాచి, తూచి తూచి సమాధానం ఇచ్చేడు.
"ఇంకా మా వివాహ వార్త ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ నాన్నగారు వొప్పుకున్నారు. మా పెత్తండ్రిగారికి చెప్పేను. ఈ హడావిడి తగ్గగానే ఇక్కడే కాపురం పెడతాము. గొడవలు వస్తాయి......"
"వస్తాయని ఎరిగి వుండి ఈ పల్లెటూళ్ళో ఎందుకు? పట్టణం చేరుకోకా?"
ఏదో మహాపరాధం చేసినట్లు పారిపోతామా? ఇది మా వూరు. పుట్టి పెరిగిన చోటు, ఇక్కడ కొద్దిమందేనా నా తరఫున వుండే జనం వున్నారు. మా ఆస్తులు ఇక్కడ వున్నాయి. ఈ చుట్టుప్రక్కల ఏదో పని చెయ్యాలని బోలెడంత కార్యక్రమం వేసుకున్నాం. ఇవన్నీ వదులుకు పోవడమా...."
"నీ సాహసం! అన్నింటిలోనూ ఒక్కలాగే వున్నావు" అంటూ మంగరాజు మెచ్చుకొన్నాడు.
"ఇందులో నా సాహసం కాదు, స్వరాజ్యానిది చెప్పు."
మంగరాజు కొంతసేపు ఏమీ అనలేదు. చివరన లేస్తూ అన్నాడు.
"అదృష్టవంతుడివి."
ఆఖరు నిముషంలో గాంధీగారి ప్రయాణ మార్గంలో జరిగిన మార్పు చిన్నదే కాని, ఆ చిన్న మార్పు ఎందరినో వుత్సాహపరిచింది. ఆయన రాకను విజయవంతం చేయడానికై ఎందరో ఉరుకులు, పరుగులుతో పని చేశారు.
చీకటి పడే వేళ శంకరశాస్త్రి ఒక కత్తిరించిన తాటాకు రేకు చేతబట్టుకొని తోటలోకి వచ్చేడు. తోట అంతా హడావిడిగా వుంది.
స్వరాజ్యం పిల్లవాళ్ళ సాయంతో మామిడి తోరణాలు, రంగు కాగితాల తోరణాలతో దారుల పొడుగునా అలంకరిస్తూంది.
శాస్త్రి స్వరాజ్యాన్ని అదివరకెన్నడూ చూడలేదు.
"ఎప్పుడూ చూడలేదు నువ్వెవరివమ్మా!"
స్వరాజ్యం నిలబడింది.
"చిరతపూడి నాయుడుగారి అమ్మాయినండి. రామనాధంగారు ఇక్కడ వున్నారండి...."
ఆమె ఎవరో తెలిసిన తర్వాత ఏడాది క్రితం సుబ్బన్నశాస్త్రి తనకు చెప్పిన సమాచారం జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం ఎన్నో అనుమానాలు మనస్సులో మెదిలేయి. కాని, ఆనాటికి వలె కొడుకును ఏమీ అనేటందుకు వీలూ కాదు, సమయమూ కాదు.
శంకరశాస్త్రి సాలోచనగా రామనాధం వున్న దిశగా తిరిగేడు. పది రాట్నాలు మామిడిచెట్టు క్రింద పెట్టుకొని శరభయ్య వానికి కావలసిన మరమ్మత్తులు చేస్తున్నాడు. పక్కనే లచ్చమ్మ కూర్చుని పనులు చేయిస్తూంది. విశ్వనాధం శంకరశాస్త్రిని చూడగానే ఎదురు వచ్చేడు.
"రావయ్యా! రా, విన్నావు కాదూ, రేపు తెల్లవారి ఏడు గంటల వేళకి గాంధీగారు వస్తారు. ఇక్కడ పది నిముషాలు వుంచడానికి బ్రహ్మప్రళయం అయిపోయిందనుకో. మనవాడు...."
"అదే విన్నాను. అందుకే వచ్చేను. అల్లాంటి మహాపురుషుడు వచ్చినప్పుడు వారిని వేదోక్తాశీస్సులతో పంపడం మన గ్రామానికి ప్రతిష్ఠ. వారి పనికి ఎంతో మేలూను. ఆ విషయం ఆలోచించేడో లేదోయని...."
చేతిలో వున్న పని పక్కనెవరికో వప్పచెప్పి రామనాధం శంకరశాస్త్రి దగ్గరకు వచ్చేడు. ఆయన సూచనకు హర్షించేడు.
"ఎవరెవరు వస్తారంటావు బాబాయి!"
"అది నాకు వదిలెయ్యి. సుబ్బావధాని ఇందాకా ఈమాట జ్ఞాపకం చేసేడు. ఇంకెవరూ రాకపోయినా మేమిద్దరం వుంటాం. ఇంక శివకామయ్యా వాళ్ళూ కొద్దో గొప్పో స్మార్తం చెప్పుకున్న వాళ్ళేగా, వస్తారు."
ఆఖరున తాను తెచ్చిన తాటాకు రేకును శంకరశాస్త్రి రామనాధానికందించేడు.
చక్కని గుండ్రని అక్షరాలతో దానిమీద భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం వ్రాసి వుంది. అక్షరాలు స్ఫుటంగా కనిపించేటందుకు కాకరాకు పసరు రుద్ది వుంది.
మేనమామ చేతి క్రింది నుంచి బాలకృష్ణ చదివేడు.
'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థానమధర్మస్య సంభవామి యుగే యుగే'
ఆ శ్లోకం అర్థంగాని, ఎందుకోగాని ఎరగని బాలకృష్ణ ముచ్చటగా వున్న అక్షరాల పొందికను మెచ్చుకొన్నాడు.
"గంటంతో వ్రాశావా, సిరాతో వ్రాశావా తాతయ్యా?"
ఆ తాళపత్రం గాంధీగారికి విరాళంతోపాటు ఇవ్వడానికి తయారుచేశాడు ప్రత్యేకంగా శాస్త్రి.
"ఏం బాగుండదా?" అన్నాడు శాస్త్రి.
ముంగండ తరఫున గాంధీజీకి అది జ్ఞాపిక, ఆయన యెడ వారి విశ్వాసానికది గుర్తు. ఆయన సందేశం యెడ వారికిగల భక్తి భావానికది సూచిక.
ముంగండే కాదు, తెలుగుదేశమే ఆ విశ్వాసంతో ప్రతిబింబించింది.
తోటలో దూరాన సూరాయి పాడుతున్న పాట విని శాస్త్రి తల ఎత్తేడు...
'సుందరమైన రాట్నమే పసందు బాంబురా సందేహమేలా అందులోనే స్వరాజ్యమున్నాదిరా!'
శంకరశాస్త్రి తల పంకించేడు.
"ఒక్కొక్క జాతకం...."
--అని ఏదో అదృశ్యశక్తికి ఓ నమస్కారం చేశాడు.
రామనాధం నవ్వుకున్నాడు.
కొల్లాయిగట్టితేనేమి? నేనెందుకు రాశాను?
Hidden Springs of the Indian National Movement ను తెలుగు నాటి కమ్యూనిస్టు Cadre కి చెప్పడం కోసమే నేనీ నవలను వ్రాసేను.
1960ల నాడు నేను ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్రలో సబ్-ఎడిటరుగా పనిచేస్తున్నాను. ఆ రోజులలో ఆదివారం ప్రత్యేక సంచిక బాధ్యత నేను చూస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సంచికకై వ్యాసాలు సేకరిస్తున్నాను. ఆ సందర్భంగా వచ్చిన ఒక వ్యాసం నా మనస్సుకు చాలా బాధ కలిగించింది. 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిన ఆంధ్రపత్రిక అల్లూరి సీతారామరాజును దౌర్జన్యకారిగా నిందించిం'దని రచయిత అభ్యంతరం. గాంధేయ అహింసావాదాన్ని సమర్థిస్తూ 1922లో ఆంధ్రపత్రిక ఆ వ్యాఖ్య చేసి వుండవచ్చు. అభిప్రాయభేదంగా చూడాలి తప్ప అది నింద్యమేం కాదు. 1936నాడు సోషలిస్టు-కమ్యూనిస్టు సాహిత్యాన్ని పల్లెటూళ్ళకు తీసుకెళ్ళినప్పుడు మా వాకబు గ్రామంలో ఆంధ్రపత్రికనెవరు తెప్పిస్తారు? ఎవరు చదువుతారు? అనే. ఆ పాఠకులు సామాజికంగానూ, రాజకీయంగానూ పురోగామి భావాలు కలిగి వుంటారనీ, వారి మనస్సులు సోషలిస్టు భావాన్ని ఆకళింపు చేసుకోగలుగుతాయనే మా అభిప్రాయం. సాధారణంగా వారు మమ్మల్ని మాట్లాడనిచ్చేవారు, వినేవారు. మర్యాదకైనా పుస్తకాలు తీసుకొనేవారు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలలో రాజకీయ, సామాజిక సంస్కారం కలిగించిన ఆంధ్రపత్రికను 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిందని' నిందించడం నాకు కష్టం అనిపించింది. దీనికి కారణం జాతీయోద్యమ పురోగతికి ఏయే శక్తులు ఏ విధంగా తోడు పడ్డాయో తెలీకపోవడమే అనిపించింది.
ఆ రాసిన వారొక కమ్యూనిస్టు రచయిత. బహుగ్రంథకర్త. అంతేనా? ప్రజాసంఘాలతో సంబంధం వున్న కార్యకర్త.
కమ్యూనిస్టు వుద్యమం పుట్టుక నుంచీ కాంగ్రెసు వ్యతిరేకతను జీర్ణించుకున్న వుద్యమం. కాంగ్రెసు జాతీయోద్యమంలో Identify అయి విస్తరిస్తూంటే కాంగ్రెసు ఆస్తిపరుల (బూర్జువాల) సంస్థ అనీ, అది శ్రామిక వర్గ ప్రయోజనాలకు శత్రువనీ, కనుక దానిని సర్వాత్మనా వ్యతిరేకించవలసిందేననీ Cadre ను నమ్మింపచేసింది. దాని ఫలితమే ఈ వ్యాసధోరణి అనిపించింది. కనక జాతీయోద్యమ విజృంభణకు దేశంలో మూలం ఎక్కడుందో చూపడం, Educate చేయడం అవసరమనిపించింది.
ఎప్పుడో 1936-40 మధ్యకాలంలో నేను Hidden Springs of the Russian Revolution అనే పుస్తకం చదివేను. అది ఓ చరిత్ర గ్రంథం. ఆ పేరు గుర్తు వచ్చింది. జాతీయోద్యమ విజృంభణకు మూలం అయిన సామాజిక పరిణామాలను నా నవలలో చిత్రించాలి.
* * * * *
మన జాతీయోద్యమం చాలామంది భావిస్తున్నట్లు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కులమత భేదాలను, ద్వేషాలనూ నిరాకరించడంలో, నిర్మూలించడంలో దాని భవిష్యత్తు ఆధారపడి వుంది. సమాజంలో సగం మంది వున్న స్త్రీలను ముందుకు తీసుకురావడం, సమానస్థాయి కల్పించడం మీద దాని పురోగతి ఆధారపడి వుంది. అస్పృశ్యతనూ, అసమానతనూ పోనాడి వెనకబాటుతనంతో అవమానాలకు గురి అవుతున్న వర్ణ పంచమత్వాన్ని నిరాకరించడం, వారికి మిగిలిన వారితో సమాన ప్రతిపత్తిని కలిగించడం ఆ వుద్యమ పురోగతికి ఆయువుపట్టుగా వుంది. ఫ్యూడల్ ఆచారాలనూ, ఆలోచనలనూ, అలవాట్లనూ పోనాడి, జనంలో తలెత్తుతున్న కొత్త ఆలోచనలకూ, ఆచారాలకూ పుష్టినివ్వాలి. వానిని అలవాటు చెయ్యాలి.
చరిత్ర గతి క్రమంలో ఆంధ్ర ప్రజ ఫ్యూడల్ సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు, ఆలోచనలు మానవతకు విరుద్ధంగా వున్నాయని అనుమానించడం, నిరసించడం, ధిక్కరించడం శతాబ్దాలుగా సాగుతూనే వుంది. అయితే 19వ శతాబ్దంలో బెంగాల్ నుంచి వలస వచ్చిన బ్రహ్మసమాజం ప్రభావం వానికో రూపాన్ని ఇచ్చింది. వాని బలంతో జాతీయోద్యమం పుంజుకుంది. దాని వత్తాసుతో అవి మరింత పుంజుకున్నాయి. ఆ కథలూ, గాధలూ చరిత్రగా రూపొందుతున్నట్లు గ్రహించకపోతే జాతీయోద్యమ గతీ, దానిలో మన పాత్రా అర్థం కావు.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణనిస్తాను. కొల్లాయి గట్టితేనేమికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ 1968లో అవార్డునిచ్చింది. ఆ అవార్డు తీసుకోడానికి హైద్రాబాద్ సారస్వత పరిషత్తు హాలుకు వెళ్ళేను. అక్కడ నోరి నరసింహశాస్త్రిగారూ, పోలూరి ఆంజనేయ ప్రసాదుగారూ కనిపించేరు. శాస్త్రిగారు నన్నభినందించి-- "నీ నవల రెండు వడపోతలయి జడ్జిమెంటుకి వచ్చింది. నీ పుస్తకం నేను చూడలేదు. మార్కెట్టులో ప్రయత్నించినా దొరకలేదు. చివరకు అతను (ఆంజనేయ ప్రసాదు) తెచ్చి ఇచ్చాడు. చదివేను. నా చిన్ననాటి జీవితం గుర్తు వచ్చింది. చాలా అద్భుతంగా రాసేవు." అన్నారు. " నీ పుస్తకానికి నా వోటు వేశా."
"సంధ్యావందనాదికాన్నీ, సాంప్రదాయికాచారాల్నీ అపహాస్యం చేశానే మీకది ఎట్లా నచ్చింది" అన్నా. శాస్త్రిగారూ, నేనూ 1936 నుంచి మిత్రులం. వారి నైష్ఠికత నాకు బాగా పరిచితం. మల్లారెడ్డి (శాస్త్రిగారి నవల) నవల పీఠిక గురించి నేనాయనతో భేదించడం, తనను సమర్థించుకుంటూ ధర్మశాస్త్రాలను ఉదహరిస్తూ ఒక రాత్రంతా ఆయన వాదించడమూ 1960లో కథ.
"ధర్మ శాస్త్రాలు సరే, అవి ఈనాడూ అమలు జరుగుతాయనీ, జరగాలనీ మీరంటారా? నేనంగీకరించను" అన్నాను అప్పుడు. ఇప్పటి నా ప్రశ్నకి మూలం అది. శాస్త్రిగారు నవ్వుతూ. "అది నీ కమ్యూనిస్టు గోరోజనంలే, కాని చాల గొప్పగా రాసేవు. కమ్యూనిస్టువయిపోయావు గాని, తెలుగువాళ్ళు నీకు బ్రహ్మరథం పట్టేవారు కాదటోయ్" అన్నారు.
"కమ్యూనిస్టునయ్యాను గనుకనే బ్రహ్మరథం పట్టించాలన్నట్లు వ్రాసేననుకోండి" అన్నాను.
శాస్త్రిగారు గొప్ప జాతీయవాది. రెండో వేపున కట్టర్ సంప్రదాయ వాదిన్నీ. అందుకే ఈ సంభాషణను ఇక్కడ వుదహరించాను. ఆయనలోని సాంప్రదాయికత జాతీయోద్యమంలో వస్తున్న భిన్న ధోరణులకు వ్యతిరేకం కాలేదు. వానికి సహకరించింది.
శాస్త్రిగారు నా నవలలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నాను అంటే నవలలో జీవిత వాస్తవాలు చిత్రించబడినాయనుకోవాలి. అంటే సమాజంలో వస్తున్న మార్పులు, అవి తమ సాంప్రదాయక పంథాకు భిన్నంగానే వున్నా "అది కమ్యూనిస్టు గోరోజనంలే" అని సాచివేయగలంతగా అలవాటయిపోయింది. అంటే ఆ మార్పులు జీవితంలో భాగాలయిపోయాయి. ఆ మార్పులు దేశ జీవితంలో భాగాలనడాన్ని కార్యకారణ సంబంధాలుగలవిగా చూపడం చేతనే ఆయన నవలలో తన చిన్ననాటి జీవితాన్ని చూడగలిగేరు.
మాలపల్లి స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన నవలే. కొల్లాయి గట్టితేనేమి లాగ 1920 ప్రాంతాల నాటి వుద్యమాన్నే అందులో చిత్రింప బూనుకున్నారు. అయితే అందులో వుద్యమాన్నిidealistic పంథాలో చిత్రించారు. కాని, నేనీ నవలలో 'ఒక యుగసంధితో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణ'గా చిత్రించ ప్రయత్నించాను. చాల అరుదైన ఈ కళాభిజ్ఞతను సమకూర్చినది మార్క్సు వివరించిన చారిత్రకభౌతికవాద విజ్ఞానమే.
1936-37లలో మార్క్సేయ గతితర్కాన్నీ, చారిత్రక భౌతికవాదాన్నీ చదివాను అని మాత్రమే చెప్పగలను. ఆ రోజుల్లో మాకు దొరికిన మార్క్సిస్టు సాహిత్యమే తక్కువ. లెనిన్ రాసిన 'Two Tactics', 'what is to be done' లాంటివి దొరికేవి. అయితే రష్యను రాజకీయ పార్టీల Polemics మీద నాకు ఎందుచేతనో ఆసక్తి కలుగలేదు. మార్క్సు గురించి లెనిన్ వ్రాసిన వ్యాసం చిక్కింది. కాంగ్రెసు నాయకుడు కళా వెంకట్రావుగారు మార్క్సు రాసిన Capital మొదటి సంపుటం ఇచ్చాడు. దానినింక వదలలేదు. అందులో ఆయన గతితర్క సూత్రాలను రాజకీయాలకి సమన్వయం చేయడం 18th బ్రూ మెయిర్లో చూశాను. జీవితానికి గతితర్క సూత్రాలనన్వయించడం, ఆ కోణం నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవడం మీదనే నా దృష్టి అంతా.
మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాక ఆ కోణం నుంచి నా అనుభవాలన్నీ కొత్త అర్థంలో కనబడసాగాయి. నేను చదువుకొన్నది సంస్కృతం, తెలుగు, హిందీ ఈ మూడు భాషలలోనూ సాహిత్యాన్ని బాగానే చదివాను. మార్క్సిజం చదివాక ఆ చదువుకొన్నదంతా కొత్త కోణం నుంచి కనబడింది. శాకుంతలంలో కాళిదాసు 'సతాం హి సందేహ పదేషు వస్తుషః ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః' అంటూ మంచివాళ్ళకి మంచి ఆలోచనలే వుంటాయి అనే ఆనాటి జనంలోని విశ్వాసాన్ని నొక్కి చెప్పాడు. తరువాత ఓ వెయ్యేళ్ళకు పుట్టిన అయ్యప్పదీక్షితుల వారు తమ 'చిత్ర మీమాంస'లో ఆ శాకుంతల శ్లోకాన్నే వుదహరించి దాన్ని ఒక అలంకారం--ఆత్మ ప్రత్యయాలంకారం అనేవాడు. అంటే కాళిదాసు కాలం నాటి విశ్వాసం అప్పయ్య దీక్షితుల కాలం నాడు--ఒక అందంగా చెప్పిన అబద్ధం! మనుష్యుని సంస్కారంలో ఎంత మార్పు వచ్చింది? ఆ కాళిదాసే కుమార సంభవంలో 'భవనేత్ర దహ్ని' మన్మధుణ్ని మసి చేసేసిందంటాడు. అక్కడ 'భవ' శబ్ద ప్రయోగం ఔచిత్య భంగం అంటాడు, ఓ వెయ్యేళ్ళ తరవాత పుట్టిన క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో. ఈ మధ్యకాలంలో శబ్దార్థాలలోనే మార్పు వచ్చిందా? పాణిని వ్రాసినట్లు మేమంతా శతాంధువుల్లాగ చదివాం (శతాంధాః కూపం ప్రవిశంతి శతాంధుః) అన్నమాట. చదువుతున్న రోజుల్లో దేనికదే చదివాం. కంఠోపాఠం చేశాం. మార్క్సిజం చదివాక ఆ చదువుల లోపం కనబడసాగింది. 'హయ్యంగనీనమాదాయ ఘోష వృద్ధానుసస్థితాన్' అనే శ్లోకం ఆనాటి సామాజిక నిర్మాణాన్ని ఆలోచింప చేస్తున్నదనుకొన్నామా? 'సమ్పణ్శయే వీత హిరణ్మయ త్యాత్ పాత్రేనిధా యార్ఘ్యమనర్ఘశీలం' అనే శ్లోకంలో రఘు మహారాజు చేశాడని సూచించిన విశ్వజిద్యాగం వంటివి, సమాజంలో పెచ్చు పెరుగుతున్న కలిమిలేముల అవ్యవస్థను సరిదిద్దడం కోసం సమాజం విధించిన ఉపశమన క్రియలనే భావం మార్క్సిజం చెప్పే వరకూ వూహలకెందుకందలేదు?
అలాగే జీవితంలో అనుభవించినవి, చూసినవి, విన్నవి అవగాహన కావడం మార్క్సిజం చదివాకనే. గత జీవితానుభవాలను కొత్త వెలుతురులో అవగాహన చేసుకొనేందుకు నేను నిత్యం ఆలోచిస్తుండేవాడిని. ముంగండలో సంస్కృత పాఠశాల పెట్టాలనే ప్రయత్నం మూన్నాళ్ళ ముచ్చటయింది. ఎందుచేత? అంతక్రితమూ, అటు తర్వాత కూడా గ్రామంలో వారాలు చేసుకుంటూ చదువుకొంటూండిన విద్యార్థులే ఆ పాఠశాల బాలురు. అంతవరకూ మాకు సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం చెప్పిన-చెప్తూన్న పండిత గురువులే ఆ పాఠశాల వుపాధ్యాయులు. కాని అది మూడు రోజులైనా నిలవలేదు. ఎందుచేతనన్న ప్రశ్నకు చారిత్రక భౌతికవాదం సమాధానం ఇచ్చే వరకూ నాకు తట్టలేదు. చరిత్ర గతిని చూపి, జ్ఞానోదయం కలిగించిన మొదటి అంశం అది.
రెండోది మాల, మాదిగలను వీధులలోకి రానివ్వని గ్రామ వీధుల్లో మే దినోత్సవం పేరున పేటల జనాన్ని వూరేగింపుగా తెచ్చేం. గంద్రగోళం జరుగుతుందేమోనని భయపడ్డాం. కాని ఎక్కడా అభ్యంతరం మాటే వినబడలేదు. దీనికి సమాధానం మార్క్సు ఆర్ధిక సూత్రాలలో దొరికింది. ఆర్ధికావసరాల దృష్ట్యా మాల మాదిగలను వూరి వీధులలోకి తీసుకురానివ్వాలనే దృష్టి గ్రామీణులలో అదివరకే అంతర్గతంగా వుంది. అందుచేతనే ఆ వూరేగింపు ఒక విధంగా వారి వాంఛకు రూపం ఇచ్చింది. కనకనే చల్లగా వూరుకున్నారు.
రాజమండ్రిలో శ్రీపాద కామేశ్వరరావుగారని ఒక అడ్వకేట్ వుండేవారు. మంచి విద్యావంతుడు. ద్విజేంద్రలాల్‌రాయ్ నాటకాలెన్నింటినో తెలుగులోకి అనువదించిన రచయిత. వీరు తమ కోడలు చదువులకెగబడి కాపురానికి రావడం లేదని కోర్టుకెక్కేరు. ఆ కేసు విచారణలో ఒక రోజున 'వినోదం' చూడడానికి నేను కోర్టుకు హాజరయ్యేను. తరవాత కేసు నుంచి విడబడి ఆమె స్కూళ్ళ ఇన్స్పెక్ట్రస్గా పనిచేసి రిటైరయి ఇప్పుడు విజయవాడలోనే ఒక విద్యాసంస్థ నడుపుతున్నారు. ఆమె పేరు శీతారామమ్మ. నేనామెను ఇటీవలనే కలుసుకున్నా.
ఆమె స్త్రీవాద దృష్టిలో అత్తవారిమీద తిరుగుబాటు చెయ్యలేదు. చదువు కోసం ఆమె ఆసక్తి, స్త్రీలలో పెచ్చు పెరుగుతున్న విద్యాభిలాషకి ఆమె తిరుగుబాటు ఒక సూచన. ఈనాడు కాలేజీలలో చదువుతున్న యువతులు, వివిధ ఉద్యోగాలలో వున్నవారు ఆమె వారసులు. ఆ రోజుల్లోనే అనేదేమిటి? సెక్సు జీవితంలో భాగం. సమాజంలో పెచ్చు పెరిగిన కులభేదాలు ఆచార భేదాలు ఆ జీవన సహజ వాంఛని వికృతం చేయగలవేగాని నిరోధించలేవు. మా పెత్తల్లిగారి మగడు ఒక బలిజ అమ్మాయిని చేరదీశాడు. ఆమెకో యిల్లు ఏర్పరచేడు. భోజనం మినహా ఆయన మకాం అక్కడే. ఆయనకో కొడుకు కలిగేడు. ఆ కుర్రవానిని ఇంటికి తీసుకొచ్చి తన పంక్తిన పెట్టుకొనేవాడు. చదువు చెప్పించేడు. పెళ్ళి మాత్రం తల్లి కులం పిల్లనే వెతికి చేశాడు. సంప్రదాయాచారాల ప్రకారం అయితే ఆయనని వూరిలో వెలివేసి వుండేవారు. కాని ఎవ్వరూ నోరు విప్పలేదు. కాని ఆ కుర్రవానికి తన స్థితి అవమానకరంగా తోచింది. ఒకరి ఉంపుడుకత్తెగా వుండిందని తల్లిమీద కోపం. తనతో సమంగా బ్రాహ్మణత్వం ఇవ్వనందుకు తండ్రిమీద కోపం. పెళ్లి అయి వుద్యోగంలో చేరేక మరి వూరు వేపు రాలేదు. తల్లిదండ్రులను చూడలేదు. ఒక పాతిక ముప్పయ్యేళ్ళ తరువాత అతని కూతురు తన కమ్యూనిస్టు భర్తతో మా వూరు వచ్చింది. ఆమెకు మా అమ్మగారు చీర పెట్టి సత్కరించింది. అది అప్రస్తుతం. అసలు విషయం తండ్రి అనాచారాన్ని బ్రాహ్మణ సమాజం సహించింది. ఎందుచేత? ఆ కొడుక్కు తల్లిదండ్రుల మీద ఆ కోపం ఏమిటి? మార్క్సిజం అధ్యయనం చేశాకనే ఆ ఘటనలు అర్థం అయ్యాయి. ఒకవేపున కులాచారాల పట్టు సమాజంలో శిధిలం అయిపోతూంది. కృత్రిమంగా బిగిసివున్న ఆచారాలు కల్పిస్తున్న అవమానం సహించరాదనే జ్ఞానం, చైతన్యం కొత్తతరంలో మేల్కొంది. ఈ విధంగా సమాజం నూతన సంబంధాలను ఏర్పరచుకోవలసిన రోజు వచ్చింది. సమాజం అటు వేపు కదులుతూంది. ఈ నిర్లక్ష్యాలు, కోపతాపాలు నూతన దశకు హార్బింజర్సు (Harbingers) మాత్రమే. మార్క్సిజం చదవనంత వరకు ఈ ఘటనల మీద నా ఆలోచనలు ఆ వ్యక్తుల చర్యలకు విరుద్ధంగానే వుండేవి. అవి సామాజిక ధర్మాలుగా తోచలేదు.
రెబ్బాప్రగడ మందేశ్వరశర్మగారు, జోస్యుల అప్పురామమూర్తిగారు వంటి నైష్టిక దేశభక్తులు నాకు సన్నిహితంగా వుండేవారు. వారు తమ ఆస్తులు, ఆరోగ్యం, కుటుంబాలు గురించి చూసుకోలేదు. ప్రజాసేవకు అమూర్తమైన దేశ సేవకు కాదు సుమండీ. గిరిజన, హరిజన సేవకు జీవితాలను ఖర్చు చేశారు. కాని కులాచారాలను కొంచెం కూడా పట్టువిడవకుండా ఆచరించేవారు. దీనికి సమాధానం ఇచ్చినది మార్క్సిజంలోని మానవత్వం, కార్యకారణ సంబంధాలను ఆలోచింపచేయగల తార్కిక శక్తిని భూతకాలం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వున్న మార్గాల క్రమ పరిణామాన్ని చూడగల అవగాహనశక్తిని అది అందించింది. నేను అందుకోగలిగేనని ఇప్పుడు చదువుతున్న అమృతలాల్ సాగర్ 'అమృత్ ఔర్ విష' చెప్తూంది. 1960ల నాటి లక్నో సమాజం, యు.పి., రాజకీయాలు దానిలో ప్రస్తుతం. 1960లలోనే నేను రాసిన కొల్లాయి గట్టితేనేమిలో చిత్రించిన 1920ల నాటి ఆంధ్రదేశపు గ్రామాల స్థితిని నైష్ఠికులైన నోరి నరసింహశాస్త్రిగారు తన కథే తను జీవించిన తెలుగు సమాజమే అన్నంత తాదాత్మ్యాన్ని అనుభవించారు. అది ఆయన మాటే. 1960ల నాటి మన ఆంధ్ర సమాజ జీవితాన్ని నా నవల 'కత్తుల వంతెన', 'ఎవరికోసం'లలో చిత్రించేను, ఈ మూడు చదివితే మన తెలుగునాడులో ఈ నలభై ఏళ్ళ మధ్య కాలంలో వచ్చిన అభివృద్ధి కనబడుతుంది. ఆ దృష్టిలోంచి చూస్తే ఉత్తరప్రదేశ్ సమాజం 1920 నాటి తెలుగు సమాజం స్థాయికి కూడా రాలేదనిపిస్తూంది. బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడిన తీరే, సామాజిక పరిస్థితులే అక్కడ వున్నాయా? జాతీయోద్యమం విస్తరించడానికి అవసరమైన సామాజిక పరిణామ క్రమం అక్కడ పనిచేయలేదా? ఆ విషయంలో ఆంధ్రదేశం చాలా చాలా ముందే వుంది.
ఇదెట్లా సందర్భపడింది? ఆంధ్ర జిల్లాలకు భౌగోళికమైన ఒక సౌలభ్యం వుంది. అది ఉత్తరానికి, దక్షిణానికీ మధ్య సేతువులా వుంది. పశ్చిమాన వున్న మహారాష్ట్రంతో, కర్ణాటకంతో సుదీర్ఘమైన సరిహద్దు వుంది. ఫలితంగా ఏ దిశలో వచ్చిన భావ విప్లవమూ ఆంధ్రకి ఇట్టే అందేది. ఈనాడు తెలుగునాడు ప్రతి గ్రామం కూడలిలోనూ జరుపుకొనే వినాయక నవరాత్రి ఉత్సవాలు మనకి మహారాష్ట్రం నుంచి అందేయి. ఆంధ్రదేశపు వర్తమాన చరిత్రనే మార్చివేసిన బ్రహ్మసమాజం, రెండు వేల ఏళ్ల క్రితం ఆంధ్రలో మూల మూలకంటా విస్తరించిన జైన బౌద్ధమతాలు ఉత్తరాది నుంచి వచ్చాయి. వీరశైవం కర్ణాటక దేశపు బహుమతి. వైష్ణవం తమిళ బహూకృతి. ఇటీవలి కాలంలో పెరియార్ రామస్వామి నాయకరు Self-respect movement మన వైవాహిక సంప్రదాయాలను పూర్తిగా తల్లక్రిందులు చేసింది. నేడు ఆంధ్రలో పరిపాటి అయిపోయిన దండల పెళ్ళిళ్ళూ, సభాముఖంగా పెళ్ళిళ్ళూ పద్ధతిని ప్రవేశపెట్టినదీ, అలవాటు చేసినదీ కమ్యూనిస్టులు. Self-respect వుద్యమ నాయకుడుగా పేరు పొందిన జీవానందం మొదటి తరం కమ్యూనిస్టులకు ఆప్త మిత్రుడు. ఈ వివిధ భావాలూ, వుద్యమాలూ తెచ్చిన సంస్కారాన్ని ప్రజల సంస్కారంగా మార్చిన ఘనత వీరేశలింగం, చలం గార్లదీ, మార్క్సిస్టు భావజాలానిదీ. మద్రాసులో నేను వుద్యోగం చేస్తున్న కాలంలో తమిళ, కర్ణాటక మిత్రులతో పలుమార్లు ఈ విషయం మీద చర్చలు జరిగినప్పుడు తెలుగు యువకుల మనస్సుల తుప్పుదుళ్ళ కొట్టినదీ, ఇతర రాష్ట్రాలు వారు వదుల్చుకోలేకుండా వున్న inhibitions పీడవదల్చినదీ వీరేశలింగం, చలమూనని వాదించేవాడిని. కేరళీయులకు వారి సంస్కర్తలున్నారు. పంతులుగారిదీ, చలంగారిదీ ఋణం తీర్చగలది కాదు.
దేశ సాహిత్యంలో కొల్లాయి గట్టితేనేమి? నవలకున్న స్థానాన్ని అర్థము చేసుకోవాలంటే భారతీయ సమాజంలో ఆంధ్ర ప్రజాజీవితంలోని ప్రత్యేకతలను అర్థము చేసుకోవాలి. మిత్రులు రాచమల్లు రామచంద్రారెడ్డి తమ 'సంవేదన' వ్యాసంలో ఇలా వివరించేరు.
".....1920 నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్లోనూ, పంజాబ్లోను ఆనాడు టెర్రరిస్టు వుద్యమం బలంగా వుండింది. ఆంధ్రదేశ రాజకీయాల్లో అది ఎప్పుడూ ప్రవేశించలేదు. మహారాష్ట్రలోనూ, ఇతర ఉత్తర భారత ప్రాంతాలలోనూ, జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాదప్రాబల్యమూ పెనవేసుకొని వుండినాయి. ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు. మతాభిమానమూ, సనాతన ధర్మమూ బ్రిటిష్‌వాళ్ళ తాబేదార్లుగా వ్యవహరించాయేగాని దేశభక్తులెప్పుడూ వానిని ఆదరించలేదు. కాంగ్రెసు మంత్రులకూ, స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు ఈనాడు వేలుపైనాడు గాని, ఆనాటి జాతీయ నాయకులు ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవునికెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి తెలుగుజాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించినాయి. అనగా 1920 నాటికే తెలుగుదేశంలో మత విశ్వాసాలమీద తిరుగుబాటు, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై వుండింది. ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు."
(సారస్వత వివేచన పుట-10)
ఆ సమాజంలో నిత్యజీవితం గడుపుతున్న వానికి ఈ లోతులు ఎప్పుడో కాని అర్ధం కావు. అర్థం అయినప్పుడు కలిగే ఆనందానికి అంబరం వుండదు.
ఈ నవల రాస్తున్న రోజుల్లో ఓ మారు రాజమండ్రిలో మా తమ్ముడు జగన్మోహనుని యింటికి వెళ్ళేను. అప్పుడే అక్కడికి సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు వెన్నేటి సత్యనారాయణగారు వచ్చేరు. నేను రాస్తున్న నవల ప్రసక్తి వచ్చింది. నా ప్రయత్నాన్ని అభినందిస్తూ నేనెప్పుడూ విని వుండని రెండు విషయాలు చెప్పేరు. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారిని కాలేజీ నుంచి బహిష్కరించిన కేసులో ప్రభుత్వం నియమించిన విచారణాధికారి మోచర్ల రామచంద్రరావుగారు విచారణానంతరం ఒక మాట అన్నారట. "నా కొడుకే ఆ విధంగా వ్యవహరించి వుంటే ఎంతో సంతోషించేవాడిని"... అని.
"అటు తర్వాత రాజమండ్రిలో జాతీయ కళాశాల పెట్టాలనే ఆలోచన వచ్చి టౌనుహాలులో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు డిప్యూటీ కలెక్టరూ, డి.వై.ఎస్.పి. వచ్చి కూర్చున్నారు. వారి రాక టౌను పెద్దలలో చాల మందికి బెదురు పుట్టించింది. సభకు పిలిచిన న్యాయపతి సుబ్బారావుగారు అందరికీ ధైర్యం చెప్పేరు. సభను ప్రారంభించే ముందు ఆయన బంట్రోతును పిలిచి కొత్తవాళ్ళు రాకుండా గేటు వేసెయ్యమన్నారు. తరవాత సభలో కూర్చున్న వారిలో ఆహ్వానాలు లేనివారిని పంపెయ్యమన్నారు. ఆ మాట అనడంతో అనాహూతంగా వచ్చిన అధికారులు సభ విడిచిపోయారు" అంటూ "మీరు మితవాదులనేవారు చేసిన పని ఇది. మీరే అయితే ఆ ధైర్యం చేసి వుండేవారా?" అని సవాలు విసిరేరు. నేను నవ్వేను. "మా కమ్యూనిస్టులకి ఆ ఉపాయం తోస్తుందా అంటే చెప్పలేను. కాని ధైర్యం ఫర్వాలేదు" అన్నాను.
మిత్రులు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు 'తెలుగుజాతి జీవనంలో జాతీయోద్యమం కంటె ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించాయి' ఎలాగ? ఎందుచేత? అనే ప్రశ్నలకి సమాధాన రూపంలో మార్క్సు రచనల నుంచి పేజీలకు పేజీలు ఎత్తిచూపి నాకున్న పాండిత్యాన్ని ప్రదర్శించే బులపాటం లేదు. అంత అవసరమూ లేదు. నా మనస్సుని పట్టిపోయి, నా ఆలోచనలను శాసిస్తున్న మార్క్సు సిద్ధాంతాలను నా మాటలలో చెప్పి వదిలేస్తా-- ఆర్థిక నిర్మాణం మారుతున్నప్పుడు సమాజవ్యవస్థ యొక్క నిర్మాణ రూపాలు మారుతాయి. ఒక వ్యవస్థలో ఎంతో చక్కగా పనిచేసిన నిర్మాణరూపాలే మరో వ్యవస్థలో పనిచేయవు. మనిషి ఎప్పుడూ తన సుఖాన్నీ, సౌలభ్యాన్నీ చూసుకొంటాడు. వానికి అనుగుణంగా జీవనపద్ధతిని సవరించుకుంటాడు. అటువంటి సవరణల సంఖ్య పెరుగుతూ వచ్చి జీవన పద్ధతులే మారిపోతాయి. ఇదంతా చాపకింద నీరులా మారుతున్న మార్చుకుంటున్న మనిషికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. కొత్తపాతలని అర్థం చేసుకునేందుకు శాతాల నిర్ణయం పనికిరాదు. ఏది క్రమంగా పెరుగుతూంది, ఏది క్షీణిస్తూంది గమనించాలి. నీ కోరికలతో నిమిత్తం లేకుండా ఈ పరివర్తన సాగిపోతూనే వుంది. ఆ క్రమంలో మానవుడూ, వాని సమాజ నిర్మాణమూ సాగిపోతున్నాయి. మనం ఎంతో దుర్భరమూ, అన్యాయమూ అని అసహ్యించుకొనే బానిసత్వం కూడా సామాజిక పురోగతికి అవసరంగానే ఏర్పడింది. అది సమాజంలోని ఆర్థిక పురోగతికి ఆటంకంగానున్నప్పుడే తొలగి పోతుంది. అమెరికాలో నీగ్రో బానిసల శ్రమ ఉత్పత్తికి ఆటంకమైంది. కనుకనే ఉత్తర రాష్ట్రాలు బానిసత్వ నిర్మూలనకై పోరాటం జరిపాయి. ఈ మార్పులన్నీ మనిషికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. కారణం మార్పులకి మూలం ఎక్కడుందో వారికి అర్థం అయ్యే పరిస్థితులు లేవు. కారణం అర్థం కాకపోయినా ఫలితాలు చూస్తాడు. వాని ప్రతిబంధకత్వాన్ని చూస్తాడు. అనూచానంగా వస్తున్న నిర్మాణాలనూ, అచారాలుగా మారిపోయిన అలవాట్లనూ ఎందుకు మార్చాలో తన ఆలోచనలకనుగుణంగా సిద్ధాంతీకరిస్తాడు. ఇదో అనంతమైన యాత్ర. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరిణామం, సమాజ పరిణామ సూత్రానికి భాష్యం చెప్పింది. దానిని అర్థం చేసుకుని పని చేస్తే సమాజ గతిని త్వరితపరచగలం. ప్రస్తుతం తలెత్తి విజృంభిస్తున్న శాస్త్ర, సాంకేతికాభివృద్ధితో ముడిపడిన అధికోత్పత్తి విధానం యొక్క పరిణామం సోషలిజంలోకి, దాని నుంచి కమ్యూనిజంలోకి పరివర్తనను తెచ్చి తీరుతుంది. ఆ పరిణామం ఎంతకాలంలో వస్తుంది? దాని తరువాత రాగల వ్యవస్థ ఏమిటి? అనే విషయాన్ని వారు భవిష్యత్తుకే వదలివేశారు. ఇది స్థూలంగా, అత్యంత సంగ్రహంగా ఘనీభూత రూపంలో గతి తార్కిక చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం. కనీసం నేను అర్థం చేసుకున్నదీ, నాకు అర్థమయినదీ.
నా జీవితంలో 5వ ఏడాది నుంచి 40వ ఏడు వరకూ చూసినవీ, విన్నవీ, చదివినవీ విశదంగా గుర్తున్నాయి. వానికి ఈ సిద్ధాంతాన్ని జోడించి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను. దానిని చూసి మార్క్సు సూత్రాలకి జీవిత ఘటనల్ని మెకానికల్‌గా అమరుస్తున్నానని 1941-44 జైలు కాలంలో ఎస్.వి. ఘాటే అధిక్షేపించారు. నేను ఒప్పుకోలేదు. మన బంధుత్వపు పిలుపులు పెదనాన్న, చిన్నాన్న అనేవి పెదతల్లి, పినతల్లి అనేవీ వాళ్ళందరి పిల్లలూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళుగా పిలుపులూ--ఇవి మనలో కూడా ప్యువలాన్ కుటుంబాలు పరిపాటిగా వుండేవనడానికి సాక్ష్యం అని నేను జైలులో క్లాసులు నడిపినప్పుడు చెప్పేవాడిని. దానికాయన మొదట ఒప్పుకోలేదు. కాని మన పిలుపులకు కారణం ఏమయివుండాలని నేను మొదలకించా. ఏమీ చెప్పలేక అర్ధాంగీకారంగా వూరుకున్నారు. (ఫ్యువలాన్ కుటుంబం మొదలయిన వాని వివరాలు ఏంగిల్సు రాసిన Origin of Family Private Property and State లో చూడండి) ఇటువంటి నాలుగైదు సందర్భాలు తటస్థపడి నా ఆలోచనలు సరియైన దారిలోనే నడుస్తున్నాయనే విశ్వాసం కలిగింది. నా నవలలన్నీ ఆ విధమైన సమన్వయ ధోరణితో రాసినవే-- నా 'కొల్లాయి గట్టితేనేమి?'ని సమాజ పరిణామ గతిని కథలో చూపడం కోసమే రాశాను. ఆ నా వుద్దేశ్యాన్ని రామచంద్రారెడ్డి సరిగ్గానే గ్రహించారు. అయితే ఆయన కూడా దేశరాజకీయాలకే తమ అన్వేషణను పరిమితం చేశారు. సమాజ పరిణామ క్రమగతి పరిశీలన ఆయన విశ్లేషణకు బయటనే ఉండిపోయింది. నేను ముంగండనే కథా రంగంగా తీసుకోవడం మీద ఆయన తన వ్యాసంలో చేసిన వ్యాఖ్య అందుకు వుదాహరణ. "ఛాందసత్వాన్ని, ఈ వ్యవస్థ యొక్క(ఫ్యూడలిజం) పరమమైన (Absolute) రూపాన్ని చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాలలోనే సాధ్యం. అందుచేత రచయిత ముంగండను కార్యరంగంగానూ, రామనాధాన్ని కథా నాయకునిగానూ ఎన్నుకొన్నారు" అని రాశారు. ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే కాని, సామాజిక పరిణామచిత్రణను ఉద్దేశించిన దృష్ట్యా సరి కాదు. ముంగండ బ్రాహ్మణ అగ్రహారమే. నేను విన్నంత వరకు 19వ శతాబ్ధం ప్రారంభం నుంచీ దేశచరిత్ర గతితో దాని పాత్రను వింటున్నాను. 20వ శతాబ్ధారంభం నుండి సామాజిక పరిణామ గతి ఛాయలను చూస్తున్నాను.
19వ శతాబ్ధం నాటికి పీష్వాల దర్బారులో ముంగండ పండితులకు ప్రవేశం వుంది. 1818లో కిర్కీ వద్ద యుద్ధంలో కంపెనీల సేనల చేతిలో పీష్వా సేనలు ఓడిపోయాయి. ఆ యుద్ధంలో పాల్గొన్న పీష్వా సేనానాయకులలో ఒకడైన విశ్వనాధరావు అనే ఆయన తప్పించుకొని, తనకు పరిచితులూ, మిత్రులూ అయిన పండితుల సాయంతో సన్యాసిగా ముంగండలో శేషజీవితం గడిపారని నాకు నాటక అలంకారశాస్త్రాలు పాఠం చెప్పిన ఉపద్రష్ట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెప్పారు. ముంగండకు సన్యాసులకు ఆశ్రయం ఇచ్చే సంప్రదాయం వుంది. నేను బాగా చిన్నప్పుడు ఓ అవథూత స్వామి, దిగంబరంగా వీధుల వెంట నడిచిపోతుండడం చూశాను. ఆయన కోసం గ్రామస్థులు మంచినీళ్ళ చెరువు గట్టుమీద ఆశ్రమమూ చెరువులోని కంటా పావంచాలు కట్టించి ఇచ్చారు. ఈ మఠం 1930 తర్వాత గ్రంథాలయానికి, గ్రామ యువజన సంఘానికి స్థావరం అయి 1942 వరకూ పోలీసు దాడులకు గురి అయింది. దిగంబర స్వామి అనంతరం అగ్నిహోత్రస్వామి (ఈయనే మా అమ్మగారి మేనమామ), ఆయన తరువాత పొట్టి స్వాములు, చివరగా తల్లావఝుల శివశంకరశాస్త్రిగారి సోదరుడు(ఈయనే ఆఖరి వారు. 1936 వరకూ జీవించివున్న జ్ఞాపకం.) అటు తరవాత మఠం శిథిలం అయిపోయింది. మా కోసం సాగిన పోలీసు దాడులకు బెదిరిపోయారో ఏమో కొత్తవారు రానూ లేదు. ఈ పోలీసు దాడులలో మాకు గ్రామీణుల సాయం బాగా వుండేది. ఒక రోజున తెల్లవారేసరికి పోలీసు బలగం చెరువు గట్టున వున్న మఠం, గ్రంథాలయం, యువజన కార్యాలయం సముదాయాన్ని చుట్టు ముట్టుతున్నారన్న వార్త వచ్చింది. ఆ రోజుల్లో మా వద్ద ఒక రివాల్వరు (పాతది, తూటాలు లేనిది) ఉండేది. దానిని పొరపాటున గ్రంథాలయపు బీరువాలో పుస్తకాల వెనుక పడేసి, రాత్రి ఇంటికి వెళ్ళాను. దానిని తీసెయ్యాలి. వెంటనే వెళ్ళి గ్రంథాలయ కార్యదర్శికి విషయం చెప్పాను. ఇద్దరం ఆలోచనలో పడి మఠం కాంప్లెక్సుకి బయలుదేరాం. మా కంగారును చూసి పక్కింటి పడుచు ఒకామె చెరువుకు మంచినీటికి బయలుదేరినట్లు బిందె చంకన వేసుకుని బయలుదేరింది. నా మిత్రుడు పోలీసు ఆఫీసరును మాటలలో పెట్టి చెరువు వేపు తీసుకెళ్ళాడు. నేను వెనక తలుపు తెరచి గ్రంథాలయంలో ప్రవేశించి, బీరువాలో వున్న రివాల్వరు తీసి, కిటికీలోంచి క్రింద వున్న పొదల్లో పడేశాను. మా వెనక వస్తున్న యామె చూసింది. దారిన పోతున్నట్లు వచ్చి, దానిని బిందెలో పెట్టుకొని ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయింది. ఊళ్ళో ఇంటికి వచ్చిన వాళ్ళు పేడనీళ్ళు తొక్కి రావాలని శాసించే శివరామయ్య తల్లులూ, పురోహితునింట తిండి తినడం పాపంగా భావించే నరసమ్మలూనేనా వున్నది. పైన చెప్పిన ఘటనలోని శీతమ్మలూ ఉండేవారు. 1929లో 2-3 వందల మంది సత్యాగ్రహులతో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి వూరేగింపుగా వెడుతూ వచ్చిన బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం గారికి ప్రతి వీధిలో వారులు పోసి, పుష్పహారతులిచ్చిన బాలలు, పడుచులు, గృహిణులు ఎందరో గ్రామంలో ఛాందసులున్నారు. కాని వారి సంఖ్య తగ్గిపోతూంది. బ్రహ్మ సమాజ బోధనల బలంతో అందరినీ గౌరవంగా పిలవాలనే నియమం మా నాన్నగారిది. అందరూ పుల్లిగా అని పిలిచే ఒక పనివాడిని ఆయన పుల్లన్నా అని పిలిచేవారు. ఆ పిలుపుతో అతడు కనబరచిన ఆనందం, ఆత్మాభిమానం నాకు గుర్తుంది. ఈ పరిణామాలన్నీ ఏ బ్రహ్మ సమాజ మతబోధనలతో ప్రభావితులైన యువకుల ప్రభావమే అనుకోకూడదు. ముంగండ దేశ చరిత్రలో ఒక భాగంగానే వుంది. 19వ శతాబ్ధపు ప్రథమ పాదంలో పిండారీ దండుల చివరి దశలో ఒక దండు ముంగండ మీదపడి ధ్వంసం చేసింది. కాని అంతలో గ్రామంలోని యువకులు తేరుకుని కూడగట్టి, తిరిగిపోతున్న దండులో చివరనున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ కట్టేసి బ్రతికి వుండగానే మంటలలో వేసి చంపేశారు. వారి పేర్లు రాజిగాడు, గన్నడు. వారిని ఆ విధంగా చంపించిన పాప పరిహారానికై ఆ జట్టు నాయకుడు తన ఇంటి మొదటి సంతానానికి వారి పేర్లు పెట్టుకుంటానని మొక్కుకున్నాడట. ఆ సంప్రదాయం ఆ కుటుంబంలో నేటికీ పాటిస్తున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ముంగండవాసి చెల్లూరి సుబ్బారాయుడు అనే ఆయన ఝాన్సీరాణి సైన్యాలలో పనిచేశాడు. ఆమె ఓటమి అనంతరం ఆయన నానాసాహేబ్ తమ్ముడు రావు సాహేబ్ దళాలతో హైద్రాబాద్ వచ్చి, ఆ బలగం విచ్ఛిన్నం అయాక ముంగండ తిరిగి వచ్చేశారు. ఝాన్సీ సేనలలో తాము చేసిన దురంతక చర్యలను (పట్టుబడిన ఆంగ్లేయుల్ని స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా చెరుకు గానుగల కందించి చంపారట) గొప్పగా కథలుగా చెప్పుకునేవాడట. ఆ కథలన్నీ నా చిన్నప్పుడు కూడా గ్రామంలో చెప్పుకునేవారు. ఆయన ఇంటికి వచ్చాక అకారణంగానే భార్యను గునపం ఒదె వేసి చంపేసిన ఘటన చూశాక ఆయన చెప్తూండిన ఘాతుకాలు నిజమే అయివుంటాయని గ్రామం నమ్మింది. అసహ్య పడింది. తరువాత ఆయన రెండో పెళ్ళాం ఆయనకు కలిగించిన అవమానాలు, పెట్టిన తిప్పలు జనం హాస్యంగా చెప్పుకుని ఆనందించేవారు. దురంతక చర్యలలో పాల్గొన్నాడని అసహ్యించుకున్నా, ఒక ముంగండ వాసి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడనేంత వరకే ఇక్కడ ప్రసక్తి. ఈయన నా భార్య ముత్తాత తమ్ముడు.
ఈ విధంగా ముంగండ చరిత్ర గతిలో దేశంతోపాటు ముందుకు అడుగు వేసింది. దేశం అంతటితోపాటు మంచి చెడ్డల్ని అనుభవించింది. ఈ దృష్టితోనే నేను ఒక్క 'కొల్లాయి గట్టితేనేమి'లోనే కాదు. అన్ని నవలల్లోనూ దానినే కార్యరంగంగా తీసుకున్నాను.
అలాగే నవలలోని పాత్రలు, ఘటనలు మాతృకలు నిజజీవితంలో చూసినవీ అనుభవించినవే. అయితే చాలా మందిలాగ "నేను చూసినవే రాశానర్రోయ్" అని చెప్పను. ఏమంటే మనం చూసిన మనుష్యుల జీవితాలు వేరు. వారిని యధాతథంగా చిత్రించలేము. 'కొల్లాయి గట్టితేనేమి?' నవలలో స్వరాజ్యం పాత్రకూ, దాని మాతృకకూ పోలిక వారికి చదువుమీద గల ఆసక్తి కుటుంబ జీవితాన్ని భగ్నం చేసిందన్నంత వరకే. రామనాధం పాత్ర అంతే. వీరేశలింగం గారి ప్రభావంతో బాల్య వివాహం చేసుకోకూడదనుకున్నాడు. చేసుకొన్నాడు. చిన్నప్పుడే భార్యతో కాపురం వద్దనుకున్నాడు. సాగలేదు. ఆ విషయం వరకు రామనాధంలో నవలా రచయిత తనను చూపించుకున్నాడు. తర్వాత అతని జీవితం అంతా భిన్నమే. బాలకృష్ణ అస్త్రాలు సంపాదించడానికి ప్రయత్నించిన కథా, రాజకీయాలకు Protest గా టోపీలు తీసెయ్యడం, టీచరు కొట్టడం, దానిమీద తాతగారు (తండ్రిగారు) వెళ్ళి హెడ్ మాస్టరును సంజాయిషీ కోరడం ఘటనలు నా జీవితంలోనివి. కాని బాలకృష్ణ జీవితం నాకు ప్రతిబింబం కాదు. అలాగే గాంధీగారిని గన్నవరం వద్ద గోదావరి దాటడానికి వీలుగా అక్విడక్టులోకి సొలుపులు చేయించిన ఇంజనీరు కథ నిజం. ఆ ఇంజనీరు కొడుకు, అతని కథా కల్పితం. నిన్ననే ఆ నవల చదివిన ఒక అమ్మాయి "గాంధీగారు నిజంగా ముంగండ వచ్చారా?" అని రాసింది. రావడమే కాదు. ఆయనకు "యదా యదాహి ధర్మస్య' శ్లోకం తాటాకు మీద రాసి, పసరు పూసి కనబడేలా చేసి ఇవ్వడం కూడా నిజమే. కాని, తరువాత నవలలో కనిపించే 'సుందరమైన రాట్నమే' పాట అబద్దం. నిజానికి ఆ క్షణంలో నేను అక్కడే వున్నాను.
అల్లాగే బెజవాడ ఎఐసిసి బహిరంగ సభలో ఆలస్యం మూలంగా గాంధీ గారి భోజనం ఆగిపోవడం, ఆ జనం మధ్య నుంచి కోడూరు వస్తాదు సోదరులు ఆయనను భుజాన ఎత్తుకొని బస చేర్చడం నిజం. అయ్యదేవర కాళేశ్వరరావు గారి మీద అయిష్టంతో గోపాలకృష్ణయ్యగారు రామదండు వలంటీర్లను Withdraw చేయడం నిజం. కానీ పేచీకి కారణంగా చెప్పింది అబద్దం. ఆ ఘట్టంలో చిత్తరంజనదాసు, అయ్యదేవర వారు చేసుకొన్న హాస్యాలు "మీ తెలుగు వాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి"-- "అది మీ బెంగాలీల వద్ద నేర్చుకొన్నవే" అనే వాక్యాలు యదార్థం. ఆ రోజున దాసుగారికి సహాయకులుగా వున్న వలంటీరు కాట్రగడ్డ మధుసూధనరావు గారు చెప్పినవవి. దానినక్కడ ఆ రూపంతోనే అమర్చాను. ఆ విధంగా జరిగిన వానిని యధార్థంగానే చిత్రించాను. కాని వాటి పూర్వాపరాలు భిన్నం.
ఈ విధంగా వాస్తవాలు కథ నడకలో కలిసిపోయినందుచేతనే నోరి నరసింహశాస్త్రిగారు దానిలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నట్లు భ్రమపడ్డారు. ఇందులోని కథా భాగం ఏదీ సత్యం కాదు. ఉదాహరణకు అమలాపురం హాస్పిటలులో కాంపౌండరుతో జరిగిన ఘర్షణ కథ. కాని ముంగండలో శంకరశాస్త్రి జ్వరపడినప్పుడు పూజారి వైద్యుడితో జరిగిన పంతం (పాత్రలు మినహా) యథార్థం. ఫలితం ఏమయింది? నవలలో ఏ అంశమూ అసత్యం కాదు. ప్రతి ఒక్కటీ ఎక్కడో ఒకచోట, ఎవరికో ఒకరికి ఏదో రూపంతో అనుభూతమైనవే. కాని అవి అల్లాగే జరిగేయనుకున్నా ఈ పాత్ర నేనేనర్రోయ్ అన్నా, నన్ను చూసే రాశాడన్నా తామెరిగిన వ్యక్తుల్ని పాత్రలలో చూసినా అది అసత్యం, వట్టి భ్రమ.
ఇంక నా నవలలో ఎప్పుడూ ఎక్కడా ఎరిగివుండి ఎవరినో, ఎవరి చేష్టలనో బయటపెట్టాలనీ, దుయ్యబట్టాలనీ ఆలోచించలేదు. సామాజికంగా ఎదురయ్యే మంచిచెడ్డలను గానే వానిని పరిగణించాను. అందుచేత ఎవరి ముఖమైనా వానిలో కనిపించవచ్చు. పైన స్వరాజ్యం కథకీ చరిత్రగా మారిన ఒక ఘటనకీ గల పోలిక చెప్పేను. రామనాధం బావమరిది చంద్రశేఖరరావు అనాధ శరణాలయం పిల్లని పెళ్ళి చేసుకున్నట్లు రాశాను. నిజజీవితంలో కంభంపాటి తారకంగారు అటువంటి వివాహం చేసుకున్న వుదాహరణ వుంది. కాని, బ్రహ్మ సమాజం ఆంధ్ర సమాజంలో ప్రవేశపెట్టిన సంస్కరణల స్వభావం, అవి కాలక్రమంలో కులాంతర వివాహాలకు దారితీసిన ప్రథమ సంఘటనలుగా చూపడానికే వుపయోగించాను. ఇల్లా చెప్పుకుపోతే నవలలోని ప్రతి పాత్రకీ ఒక ఉద్దిష్ట లక్ష్యం నిజజీవితంలో ఓ సాక్షీ వున్నారు.
ఈ సందర్భంలో ఇంకొక్కటి గుర్తు వస్తూంది. 'కొల్లాయి గట్టితేనేమి' ఆంధ్రపత్రికలో బు.వెం.ర, (బహుశా మిత్రులు బులుసు వెంకట రమణగారేమో) స్వాతంత్రోద్యమ ప్రచారానికి రామనాధం తలపెట్టిన ఒకే ఒక పని చిరుతపూడిలో బహిరంగ సభ పెట్టబోవడం. కానీ తీరా చూస్తే ఆ సభ జరగలేదు అని హాస్యం చేసేరు తమ సమీక్షలో. మనస్సులోని కోరికలు, వేసుకొన్న పథకాలకీ, అవి క్రియారూపం ధరించడానికీ మధ్య ఎంతదూరం వుంటుందో మనకు తెలుసు. రామనాధం తానే పెట్టుకొన్న వివాహ వయోనియమాన్ని మరచి పెళ్ళి ఆడేశాడు. కారణం అటువంటి నియమాలు సమాజ సంస్కారంలో భాగం కాలేదు. భార్యతో కాపురం వెంటనే పెట్టుకోవడం తప్పు అనే ఆందోళనతో బయలుదేరి అత్తవారింటికి వచ్చినప్పుడు ఒంటరిగా చిక్కిన భార్యతో చెలగాటం ప్రారంభిస్తాడు. ఆ ఘట్టం చాల సహజంగా, చక్కగా వున్నదని రంగనాయకమ్మ గారు ప్రశంసించారు. ఈ రెండు విషయాలలోనూ రామనాధానికి నేనే ఉదాహరణా, సాక్ష్యమూను. వీరేశలింగం గారి ప్రభావంతో వివాహం చిన్నతనంలోనే చేసుకోరాదని మనస్సులోనే అనుకున్నా. ఆ రోజుల్లో అంటే-- ఈ శతాబ్ద ప్రారంభంలో మగవానికి పదేళ్లు, ఆడపిల్లకు ఎనిమిదేళ్లు వస్తుండగానే వివాహ సంబంధాలు వెతికేవారు. బ్రహ్మసమాజ ప్రభావంతో మా యింట మూడు నాలుగేళ్ళు గ్రేస్ పీరియడ్‌గా వదిలేరు. నేను 13 ఏళ్ళ వయస్సులో వుండగా మా వీధిలో, మా యింటికెదురుగా ఇల్లు కొనుక్కుని పొరుగూరు నుంచి ఒక కొత్త కుటుంబం కాపురం వచ్చింది. మర్నాడు ఉదయం మా ఇంటి గుమ్మంలో కొత్త అమ్మాయి 10 ఏళ్ళది -- పచ్చని ఛాయ, నవ్వు ముఖం, నల్లని మస్లిన్ దుస్తులతో హాజరయింది. ఆనాటి ఆ విగ్రహం 70 ఏళ్ళ తర్వాత కూడా నా కళ్ళముందు కనిపిస్తూంది. దానికి ప్రేమా, దోమా అని పేరు వద్దు. ఆడ మగ మధ్య వుండే ఆకర్షణ. అప్పటి నుంచి ఆమె మా యింటికే ఒక విధంగా అతుక్కుపోయింది. ఓ ఏడాది పోయాక ఆమెతో పెళ్ళి అన్నారు. నేను వీరేశలింగంగారి హితబోధ మరచిపోయేను. ఎగతాళిచేసి లాభం లేదు. వ్యక్తులు ఏర్పరచుకొనే నియమాలు సమాజగత సంస్కారంగా మారే లోపున వ్యవధి తీసుకుంటుంది. ఆ లోపున ఈ మాదిరి వైఫల్యాలు కలగవచ్చు. కాని ఇక్కడ ప్రధానం సంస్కరణల ఆలోచన ప్రారంభం కావడమే. అది సమాజంలో నిలదొక్కుకోవడంలో వ్యవధి పడుతుంది. "రాశి పెరగడం వాసిలో మార్పు." From quantity into quality--అనే గతి తర్క సూత్రం వినియోగం ఇక్కడే వుంది. ఆ దృష్టితోనే నా అనుభవంతో రామనాధం పాత్రను తీర్చేను. ఆ పాత్ర వేసిన ప్రతి అడుగులో వాస్తవ జీవితంలో ఎవరిదో ఒకరి అనుభవం వుంది. వివిధ భాషలలో నేను చదివిన అనంత సాహిత్యం నాకు ఎందరివో, ఎక్కడెక్కడివో అనుభవాలను సమకూర్చి పెట్టాయి. దానికి ఒక్క ఉదాహరణనిస్తా.
రామనాధం అమలాపురంలో సుందరితో సరాసరి మాట్లాడి ఆమెను సుముఖం చేసుకొనే ప్రయత్నం కథాఘట్టం. (2వ భాగం 11వ ప్రకరణం) సుందరి విముఖత కనబరచింది. "మీవాళ్ళే పంపుతే"? "తాళి కట్టించుకున్నాక తప్పుతుందా?" ఈ ఘట్టం రాస్తుంటే నేను ఎప్పుడో చదివిన దేశిరాజు పెదబాపయ్య గారి జీవితం గుర్తు వచ్చింది. అందులోని మాటలే కాకపోవచ్చు. కాని అటువంటి ఘట్టంలో పలికించే మాటలు ఒకే విధంగా వుంటాయి. అయనా, భార్యా శాశ్వతంగా విడిపోయే ముందు జరిగిందన్న సంభాషణ నా మనస్సులో నిలిచిపోయింది.
శ్రీ నోరి నరసింహశాస్త్రిగారితో నేను "సంధ్యావందనం వగైరాలను అపహాస్యం చేశానే" అని గుర్తు చేసినట్లు పైన రాశాను. కాని, అస్త్రాలు, మంత్రాల మీద మనకున్న నమ్మకం Childishness తప్ప వేరు కాదు. ఆ పేరుతో మనల్ని మోసం చేస్తున్నారని కథలోకి ప్రవేశపెట్టిన ఘట్టం స్వానుభవం. జలియన్‌వాలాబాగ్ దురంతాలు జరిపించిన బ్రిటిష్ జాతిని, బ్రిటనును భూతలం నుంచి తుడిచెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఎల్లాగ? అగ్రహారంలో చెప్పే గొప్పలూ, భారత రామాయణాది హరికథల్లో వర్ణించిన అస్త్రాలు, కథలూ విన్న మా అన్నదమ్ములకు వాటిని సంపాదిస్తే పని తీరిపోతుందనిపించింది. అప్పటికి నాకు పదకొండేళ్ళు, మా తమ్ముడు జగన్మోహనుకి తొమ్మిదేళ్ళు. అప్పటికే నేను 3వఫారమ్ పాస్ అవడం, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా చదువు మానెయ్యడమూ జరిగింది. సహాయ నిరాకరణం కాదు. అసలు సహాయం ఇవ్వవలసిన వాడే లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభించేం. మా తరగతిలో తురగా శేషగిరిరావనే అతను చదివాడు. మాకంటె పెద్దవాడు. స్కూలులో చదివే రోజుల్లోనే తన తండ్రిగారి నైష్ఠికత్వం గురించీ, తమ అటక మీద వున్న తాటాకు పుస్తకాలు గురించీ, వానిలో వున్న అస్త్ర శస్త్రాల మంత్రాలు గురించి తెగ వర్ణించేవాడు. అతన్ని పట్టుకున్నాం. అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎండ వాన అనకుండా ఓ ఆర్నెల్లు తిరిగేం... చివరకు వాడు చెప్పేవన్నీ గొప్పలని అర్ధం అయింది. ఆ ఘట్టం చదివి మంచికీ, చెడ్డకీ వ్యాఖ్యానించిన వాళ్ళు చాల మంది తగిలేరు.
అలాగే ఆ దురంతాలకి అసమ్మతి తెలుపుతూ టోపీలు తీసేసి క్లాసుకి వెళ్ళి దెబ్బలు తిన్న ఘటన. దానిలోనూ ప్రధాన పాత్రను నేనే. ఆ రోజుల్లో టోపీయో, తల పాగాయో వుండి తీరాలనే స్కూళ్ళలో నిబంధన ఉండేది. దానిని నిరాకరించాం అసమ్మతి తెలపడానికి, "ఇల్లాంటి చర్యలే జాతీయోద్యమ చరిత్రలో భాగాలు" అంటూ. పూర్వకాలపు పిచ్చి నమ్మకాల నిరాకరణం జాతీయోద్యమ పురోగతికి ఓ ఆలంబనం. టోపీ పెట్టుకోమని వ్యతిరేకించడం ఆ వుద్యమంలో ఒక సాధనం. అవి చిన్న చిన్న ఘటనలే కాని రాశిగా విస్తరించి జాతీయ జీవనంలో ఒక అడుగు ముందుకు వేయిస్తాయి, వాశి హెచ్చుతుంది.
దీనికి తరవాయి కథగా ఎత్తుకున్న 'దేశం కోసం', 'జ్వాలాతోరణం' నవలలు వాసి పెరుగుదల దశలు చూపుతున్నాయి.
ఇక్కడ ముంగండ గ్రంథాలయం గురించీ, గ్రామ యువజన సంఘం గురించీ కొంత రాస్తే తప్ప గ్రామంలో వచ్చిన పరిణామాలు స్పష్టంగా తెలియవు.
ముంగండ గ్రంథాలయం జిల్లాలోనే మొట్టమొదట ఏర్పరచిన వానిలో ఒకటి అని మా నాన్న చెప్పేవారు. గ్రామంలో మొదట రెండు గ్రంథాలయాలు పోటాపోటీగా ఏర్పడ్డాయి. ఒకటి మా నాన్న, ఆయన మిత్రులు పుల్య కృష్ణయ్యగారు ఏర్పరచిన రామమోహన గ్రంథాలయం. దీనిలో కొత్తగా వస్తున్న గ్రంథాలు వుండేవి. రెండోది గ్రామంలోని పండితులు పోటీగా పెట్టిన గజానన గ్రంథాలయం. తెలుగు కావ్యాలు, పురాణాలు మొదలైనవి ప్రధానంగా వుండేవి. 1910 ప్రాంతంలో రెండింటిని ఏకంచేసి, వివేకోదయ పుస్తక భాండాగారం అని పేరు పెట్టేరు. నాకు గుర్తు తెలిసిన అయిదవ ఏడాది నాటికి ఆ గ్రంథాలయం మా చావడిలో ఉండేది. నా చదువు దానిలోనే గనక నాకు బాగా తెలుసు.
నన్ను 5వ ఏట బడిలో వేశారు. మొదటి రోజునే ఎందుకో గుర్తులేదు. మేష్టారు తొడపాశెం పెట్టారు. పసుపురాసిన పచ్చని ఒంటిమీద నల్లగా కమిలిపోయిన తొడను చూసి మా నాన్న వెళ్ళి మేష్టారిని తిట్టి నన్ను బడి మానిపించేడు. ఇంటి వద్ద తానే అక్షరాలు నేర్పి మా సావడిలోని గ్రంథాలయంలో వదిలేరు. ప్రథమలో నేను వాచకం నేర్చుకున్న "ఆర్య కథానిథి" పుస్తకాలు (వావిల కొలను సుబ్బారావుగారివి) నాకిప్పటికీ గుర్తు. అలాగే సెట్టి లక్ష్మీనరసింహంగారి గ్రీకు పురాణ కథలు, చిలకమర్తి వారి రాజస్థాన కధావళి, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారి అబ్రహాము లింకను మొదలైనవి జ్ఞాపకం. ప్రపంచ యుద్ధ కథలను ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక బొమ్మలతో వేసేది. ఆ ఏడేళ్ళ వయస్సులోనే అవన్నీ బహు ఆసక్తిగా చదివేవాడిని. 5-6 ఏళ్ళ వయసులోనే పట్టుబడిన పుస్తక పఠనాశక్తి ఈ 85 ఏళ్ళ వయస్సుకి కూడా తగ్గలేదు.
ఆ గ్రంథాలయం 1910 నాటికి మా యింటి నుండి మారింది. 1929లో గ్రామ యువజన సంఘం ఏర్పడింది. మొదట కర్రసాము నేర్చుకోడానికి ప్రారంభమైన యువకుల సంఘం ఆనాడు నా యీడు వాళ్లు ఊళ్లో 10-15 మంది వుండేవారు. సత్యాగ్రహ ఉద్యమానికి వాలంటీర్లను పంపడం, పోలీసుల చేత దెబ్బలు తిన్నవారిని రహస్యంగా దాచి, వైద్యం చేసి తిరిగి పంపడం వంటి పనులతో బలమైన యువజన సంఘంగా ఏర్పడ్డాం. వారిలో సత్యాగ్రహ శిబిరంలో చేరిన నలుగురిలో నేనొకడిని.
ఆ ప్రాంతంలోనే మా వూరి చెరువు గట్టుమీద కట్టిన మఠంలో చేర్చి వున్న ఒక గది శిథిలం అయింది. దానిని గ్రామ యువజన సంఘం మరల కట్టింది. డబ్బు కోసం వూరి చెరువుకి నీరు పెట్టడం బాధ్యత తీసుకొని ఓ పాతిక, గ్రామంలో లక్షపత్రి పూజలు తలపెట్టిన ఇద్దరు ముగ్గురికి పదేసి రూపాయలు తీసుకొని పత్రి తెచ్చి యిచ్చే డబ్బు సంపాదించాం. మేస్త్రీ సాయంతో మేమే కూలి పనిచేసి ఆ కొద్ది డబ్బుతోనే పడిపోయిన గదిని వేసేం. అందులోకి గ్రామ గ్రంథాలయాన్ని మార్చాం. నలిగిపోయిన పుస్తకాలను బైండింగు పని నేర్చుకుని మేమే చేశాం. ఈ కార్యక్రమాలతో ముంగండ యువజన సంఘం పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. ఒక దశలో ముస్తఫాలీఖాన్ (డివైఎస్పి) గ్రామం మీద దాడిచేసి సంఘం నామరూపాల్లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలో వున్నట్లు తెలిసింది. సమావేశం అయాం. పోలీసుల చేతిలో దెబ్బలూ, చావులూ తప్పవు గనుక, మనం వాళ్ళని చుట్టుముట్టి చంపేద్దామని నిర్ణయించేసేం. కత్తులు, బల్లేలూ, ఒక రివాల్వరు, ఒక లైసెన్స్డ్ గన్ ( మా బావమరిదిది) సిద్ధం చేసుకున్నాం. కాని ముస్తఫాలీ దాడికి రాలేదు. మేమూ సర్దేసుకున్నాము.
- మహీధర రామమోహనరావు